సాక్షి,బళ్లారి: ప్లాస్టిక్ రహిత బళ్లారిగా మారుస్తాం అంటూ మహానగర పాలికె మేయర్, కమిషనర్లు ప్రకటనలను జారీ చేస్తున్నారే కాని ఆచరణలో మాత్రం వాటి అమలు శూన్యమనే చర్చ సాగుతోంది. నగరంలో హోటళ్లు, బేకరీలు, అంగళ్లలో యథేచ్ఛగా ప్లాస్టిక్ వాడకం కొనసాగిస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారే కాని నియంత్రణ చర్యలు మాత్రం చేపట్టడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులకు ప్లాస్టిక్ అనే పదం కూడా తెలియదు. అప్పట్లో వాడకం లేకపోవడంతో ఆహారపు అలవాట్లు కూడా మంచిగా ఉండటంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. మారుతున్న కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మారిపోయి ప్లాస్టిక్ వాడకం కూడా పెరిగిపోవడంతో ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇడ్లీల తయారీకి కూడా ప్లాస్టిక్ కవర్లు
ప్లాస్టిక్ కవర్లు, పేపర్లతో కూరగాయలు లేదా ఇతర వస్తువుల ప్యాకింగ్ చేస్తారనుకొంటే పొరపాటు. వేడివేడి ఇడ్లీలు తయారు చేసే పాత్రల్లో కూడా ప్లాస్టిక్ కవర్లు వేసి ఇడ్లీలు తయారు చేస్తున్నారు. వేడి వేడి సాంబారు, అన్నం ఇతరత్రా వాటిని పార్శిల్ చేసి ఇవ్వడానికి కూడా ప్లాస్టిక్ కవర్లు వాడుతుండటంతో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంగళ్లు, హోటళ్లలో ప్రతి నిత్యం ప్లాస్టిక్ కవర్లతోనే ప్యాకింగ్ చేసి ఇస్తుంటారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా హోటళ్లు, అంగళ్లలో ప్లాస్టిక్ వాడుతున్నారు. హోటళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడంలో మహానగర పాలికె సంబంధిత ఆహార అధికారులు పట్టించుకోకపోవడంతో పెద్ద హోటల్ యజమానుల నుంచి పుట్‌పాత్‌లో ఉండే చిన్న హోటళ్ల వరకు ప్లాస్టిక్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది.
ప్లాస్టిక్ వాడకంతో అనారోగ్య సమస్యలు
ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి పదార్ధాలు వేసి పార్శిల్ చేయడంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు వాపోతున్నా వాటిని నియంత్రించడంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. హోటళ్లతో పాటు బేకరీల్లో వేడివేడి పదార్ధాలు ఉంచి పార్శిల్ చేసే వారిపై ఉక్కుపాదం మోపకపోతే ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. తక్షణం హోటల్‌లో వాడే ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధంపై అధికారులు చొరవ చూపాలి. నగరంలోనే ప్టాస్టిక్ నిషేధం కాకపోతే గ్రామాలు, పట్టణాల్లో ఏ స్థాయిలో వాడకం సాగిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా అధికారులు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బేకరీల్లో ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాల ప్యాకింగ్ దృశ్యం
ప్లాస్టిక్ కవర్లలో వేడి అన్నం, వంటలు పార్శిల్ చేసిన దృశ్యం
రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం
పెరుగుతున్న వైనం
హోటళ్లలో వేడి పదార్ధాల
ప్యాకింగ్‌కూ కవర్లే దిక్కు


