రాయచూరు రూరల్: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో బుధవారం రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ మూల విరాట్‌కు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి పాటిల్‌ను ఽశేష వస్త్రాలతో సన్మానించారు. జిల్లాధికారి కార్యాలయంలో రాయచూరు డీఎస్పీ శాంతవీర ముఖ్యమంత్రి పతకం అందుకున్న సందర్భంగా మంత్రి పాటిల్ సన్మానించారు. శాసన సభ్యులు బసనగౌడ దద్దల్, హంపయ్య నాయక్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగర సభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, అదనపు జిల్లాధికారి శివానందలున్నారు.
తల్లిదండ్రులు పిల్లలపై
శ్రద్ధ కనబరచాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరుగుతున్న లవ్ జిహాద్‌ల వల్ల ఘర్షణలు చెలరేగుతున్న సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ కనబరచి నిఘా ఉంచాలని ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రేమ పెళ్లి పేరుతో యువత దారి తప్పుతున్నారని, ఈ విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించకుండా దృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు.
తాగునీటి కోసం రాస్తారోకో
రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా స్పందించక పోవడాన్ని నగరవాసులు తప్పుబడుతూ రాస్తారోకో చేపట్టిన ఉదంతం విజయపురలో నెలకొంది. 15 రోజుల క్రితం వదిలిన తాగునీటిని నేటికీ వదలక పోవడంతో 12వ వార్డులో అధికారులను దూషిస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్నికల నిబంధనలను రాజకీయ నాయకులు ఉల్లంఘించరాదని, అధికారులు తాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఖండిస్తూ రాస్తారోకో చేశారు.
కనీస వేతనాలు చెల్లించండి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఏఐసీసీటీయూ డిమాండ్ చేసింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద సంఘం అధ్యక్షుడు అజీజ్ జాగీర్దార్ మాట్లాడారు. కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారిపై చేస్తున్న దౌర్జన్యాలు నశించాలన్నారు. నేడు అన్ని విధాలైన వస్తువుల ధరలు మార్కెట్‌లో అధికం కావడంతో వేతనాలను పెంచాలన్నారు. అసంఘటిత వలయాల్లో విధులు నిర్వహించే కార్మికులకు నెలకు రూ.37 వేల నుంచి రూ.42 వేల వరకు వేతనాలు చెల్లించేలా సర్కార్ చెల్లించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
భూముల మంజూరును
రద్దు చేయండి
రాయచూరు రూరల్: రాజధాని బెంగళూరులో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సర్కారీ భూములను రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రుద్రయ్య మాట్లాడారు. బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి పరిధిలోని అరకేననళ్లి, మల్లేన హళ్లి ప్రాంతాల్లో సర్వే నంబర్–37లో 835 ఎకరాల భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని, వాటి విలువ నేడు సుమారు రూ.1500 కోట్లు అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం భూమిలేని పేదలను గుర్తించి వారికి భూములను పంపిణీ చేయాలన్నారు. ఈ భూములు ఎంఎస్ రామయ్య కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని, దానిని రద్దు చేసి ప్రభుత్వం స్వాధీన పరుచుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.


