రాయచూరు రూరల్: తాలూకాలోని బిచ్చాలిలో వెలసిన గురు మహంతేశ్వర రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. పీఠాధిపతి వీర తపస్వి వీరభద్ర శివాచార్య వేలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. మఠంలో శాంతమల్ల శివాచార్యులు ప్రత్యేక పూజలు నెరవేర్చారు. రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జునగౌడ పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుపై ఆందోళన
హుబ్లీ: గత 8–10 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న జిల్లాలోని నవలగుంద తాలూకా ప్రభుత్వ ఆస్పత్రి డీ గ్రూప్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉన్నఫళంగా పని నుంచి తొలగించడంపై సదరు ఆస్పత్రి ఉద్యోగులు అక్కడి తహసీల్దార్ కార్యాలయం, ఆస్పత్రి ఎదుట నిరవధిక సమ్మె ప్రారంభించారు. సంబంధిత ఏజెన్సీ ద్వారా విధుల్లో ఉన్న ఉద్యోగులను ఆస్పత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ రూపా చినగి ఎలాంటి ముందస్తు సూచన ఇవ్వకుండా విధుల నుంచి తొలగించారని ఆందోళనకారులు ఆరోపించారు. గత 5 నెలల నుంచి జీతాలు కూడా చెల్లించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు హరీష్, రేణవ్వ, లక్ష్మీ తదితరులు పాల్గొని ఎమ్మెల్యే కోనరెడ్డికి వినతిపత్రాలను సమర్పించారు.
వేధింపుల కేసులో జిమ్ ట్రైనర్ అరెస్ట్
హుబ్లీ: నగరంలో జిమ్ సెంటర్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ధార్వాడలో షబ్బీర్ అనే ఓ జిమ్ ట్రైనర్ మహిళలతో అసభ్యంగా నడుచుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. ధార్వాడ మరాఠ కాలనీ జిమ్‌లో హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతూ వ్యాయామం పేరుతో బ్యాడ్‌టచ్ చేసేవాడని, అంతేగాక మహిళల అవయవాలను చిత్రలేఖనంతో అసభ్యంగా చిత్రీకరించి కామెంట్ చేసేవాడని ఆరోపిస్తూ సదరు జిమ్ సెంటర్‌కు హిందూ పర సంఘాల కార్యకర్తలు, పలువురు మహిళలు తాళం వేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో విజయలక్ష్మి అనే బాధితురాలు కూడా షబ్బీర్‌పై ధార్వాడ ఉపనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని షబ్బీర్‌ను అరెస్ట్ చేసినట్లు కమిషనర్ తెలిపారు.
ఏఐసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలు అసంబద్ధం
రాయచూరు రూరల్: ఆర్‌ఎస్‌ఎస్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని బీజేపీ న్యాయ సలహా ప్రకోష్ట పేర్కొంది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు భీమనగౌడ మాట్లాడారు. అసోం ఎన్నికల ప్రచారంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను విష సర్పంతో పోల్చడాన్ని ఖండించారు. మైనార్టీలు నమాజ్ చేసేటప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ కనబడితే చంపాలని పేర్కొనడాన్ని తప్పుబట్టారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై లేనిపోని ఆరోపణలు చేసిన మల్లికార్జున ఖర్గేపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ అరుణాంగ్శుగిరికి వినతిపత్రం సమర్పించారు.
విద్యార్థులకు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కన్నడ సాహిత్య పరిషత్ కార్యదర్శి దండెప్ప బిరాదార్ పేర్కొన్నారు. బుధవారం రాయచూరు తాలూకా ఉడుంగల్ ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర విషయాలపై కూడా దృష్టి సారించాలన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యమని అన్నారు. సమావేశంలో వీరేష్, శివలీల, వీణ, సరస్వతి, సావిత్రి, నఫీసా అంజుంలున్నారు.
వృద్ధులకు ఔషధ సాయం
హుబ్లీ: నవనగర్‌లోని వివేకానంద వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అవ్వతాతలకు విక్కీ బాయి ఫౌండేషన్ చేయూతను ఇచ్చింది. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న సుమారు 25 మంది అవ్వతాతలకు నెలకు సరిపడా బీపీ, షుగర్, మూత్రవ్యాధులు, ఆర్థోపెడిక్, గుండె తదితర జబ్బులకు ఔషధాలను విక్రమ్ బాయి ఆశ్రమ సీనియర్ ఉద్యోగి, సూపరింటెండెంట్ రుద్రయ్య మడివాళ చరంతిమఠకు అందజేశారు. విక్రమ్ బాయి మాట్లాడుతూ ప్రతి నెల ఔషధాలను అందించేందుకు కృషి చేస్తానన్నారు.


