సాక్షి, బళ్లారి: ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, అవినీతి రహితంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని డీజీపీ డాక్టర్ ఎంఏ సలీం పోలీసు అధికారులకు సూచించారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయ సమావేశం మందిరంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు శాఖలో చేరుతున్న జూనియర్ అధికారులు సీనియర్లతో తమ అనుభవాలను పంచుకొని వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. పోలీసు ఉద్యోగం ఎంతో కఠినమైందని, బాధ్యతాయుతంగా పని చేయాల్సి ఉంటుందన్నారు.
సాంకేతికత పాత్ర కీలకం
నేటి ఆధునిక కాలంలో నేరాల నివారణలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పోలీసు శాఖలో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసు సిబ్బంది సరైన శిక్షణ పొందాలని సూచించారు. కేసుల దర్యాప్తులో సాంకేతికతను సమర్థంగా వినియోగించి, చట్టాన్ని, న్యాయాన్ని శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు. అనంతరం ఆయన పోలీసు అతిథి గృహాలను పరిశీలించారు. పోలీసు కుటుంబ సభ్యులతో సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. అలాగే నగరంలోని బ్రూస్‌పేట్ పోలీస్టేషన్‌ను సందర్శించారు. బళ్లారి రేంజ్ డీఐజీ డాక్టర్ హర్ష, జిల్లా ఎస్పీ సుమన డీ.పన్నేకర్, ఏఎస్పీ నవీన్‌కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి
పోలీసులకు డీజీపీ డాక్టర్ సలీం సూచన


