హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె నగరంలో స్వచ్ఛతను కాపాడుకోవాలని, నగర ప్రజలు ఈ విషయంపై దృష్టి పెట్టాలని నగరసభ కమిషనర్ ఎర్రగుడి శివకుమార్ తెలిపారు. మంగళవారం నగరంలోని నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సామాన్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే నగరంలో ఇప్పటికే దోమల బెడద విపరీతంగా పెరిగిందన్నారు. అదే విధంగా నగరంలో ప్రముఖ రహదార్లతో పాటు కాలనీల్లో కూడా ప్రజలు ఇష్టానుసారంగా చెత్తను పారవేస్తున్నారన్నారు. దీని వల్ల దుర్వాసనతో పాదచారులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఇకపై నగరవాసులు తమ ఇంటి వద్దకు వస్తున్న మున్సిపాలిటీ వాహనంలో మాత్రమే చెత్తను వేయాలన్నారు. ఇక మీదట రహదార్లలో చెత్తను పారవేస్తే వారిపై నియమానుసారంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు. నగరసభ అధ్యక్షులు రూపేష్‌కుమార్, ఉపాధ్యక్షులు జీవరత్నం, స్థాయి సమితి అధ్యక్షులు శరవణన్, వివిధ వార్డుల సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


