రాయచూరు రూరల్: నగరంలో ఆదివారం అక్క మహాదేవి జయంతిని ఘనంగా జరుపుకున్నారు. బసవ కేంద్రం అధ్యక్షుడు నాగన గౌడ ఆధ్వర్యంలో అక్క మహాదేవి చిత్రపటాన్ని ఊరేగించారు. బసవణ్ణ, అక్క మహాదేవి వేషధారణలతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. రుద్రప్ప మాట్లాడుతూ.. వీర రాగిణి అక్క మహాదేవి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో దానమ్మ, గిరిజా శంకర, బసవరాజ్, చెన్నబసవ, మాలి పాటిల్, జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
భానుడి భగభగలు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిపోయింది. కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాలో రెండు రోజుల నుంచి ఉక్కపోత అధికమైంది. ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందకు భయపడుతున్నారు. వ్యాపారులు దుకాణాలను బంద్ చేసుకుని వెళ్లిపోతున్నారు. ఆదివారం రాయచూరులో 40.01 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని జిల్లా అధికారి నితీష్ తెలిపారు. యాదగిరిలో 42.05, కలబుర్గిలో 41.05, బాగల్ కోటలో 42.05, బీదర్‌లో 42.04, విజయపురలో 42, బెళగావి, కొప్పళ, గదగ్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జిమ్ ట్రైనర్ అరెస్ట్
హుబ్లీ: యువతిపై లైంగిక దాడి చేసిన జిమ్ ట్రైనర్ విజయనగర సమీర్ ముల్లాను విద్యానగర పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు. సమీర్ జిమ్ శిక్షణ పేరుతో యువతిని తన ఇంటికి తీసుకెళ్లి మత్తు పదారర్థం ఇచ్చి లైంగికంగా వాడుకున్నాడు. యువతితో కలిసి ఉన్న దృశ్యాలను వీడియో రికార్డు చేశాడు. చెప్పినట్లు వినకపోతే ఈ వీడియోను వైరల్ చేస్తానంటూ బెదరించాడని బాధితురాలు విద్యానగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సమీర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం బాధితురాలికి కేఎంసీ ఆస్పత్రి నిర్భయ ప్రత్యేక వార్డులో వైద్య పరీక్షలు చేయించారు. మానసిక వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించారు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు నగర డీసీపీ శృతి మీడియాకు తెలిపారు.
మహిళలకు ఆత్మరక్షణపై శిక్షణ
హొసపేటె: మహిళ నిస్సహాయురాలు కాదు, ఆమె బలవంతురాలు. ఆత్మరక్షణ అనేది కేవలం శారీరక బల ప్రదర్శన మాత్రమే కాదు, అది ఆత్మవిశ్వాసానికి చిహ్నమని జిల్లా కలెక్టర్ కవిత మన్నికేరి అన్నారు. నగరంలోని విజయనగర కళాశాలలో మహిళల కోసం ఆత్మరక్షణ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. మహిళల పై దోపిడీ, హింస ఘటనలు తగ్గలేదు. అందువల్ల, ప్రతి మహిళ శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలన్నారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రతి మహిళా ఆత్మరక్షణ పద్ధతులను నేర్చుకోవడం తప్పనిసరి అని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వారు 112 నంబరుకు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఎస్పీ ఎస్.జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.
కలసిమెలసి జీవించాలి
రాయచూరు రూరల్: భారతదేశంలో శాంతి, సౌహార్ధతకు ప్రాధాన్యత ఉందని కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు అభిప్రాయపడ్డారు. శనివారం రాత్రి నగరంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో జమాతే ఇస్లామి హింద్ ఈద్ సౌహర్ద కూట ఏర్పాటు చేసిన సభలో స్వామీజీ మాట్లాడారు. శాంతికి చిహ్నంగా ఉన్న భారత్‌లో హిందువులు, ముస్లింలు సహోదరులుగా మెలుగుతున్న విషయాలను గుర్తు చేశారు. సమాజంలో ప్రజలు గొడవలకు వెళ్లకుండా కలసిమెలసి జీవించాలని సూచించారు. కార్యక్రమంలో లోక్‌సభ సభ్యుడు కమార్ నాయక్, శ్యామోవెల్, శాలం, శాంతప్ప, రజ్ఖా ఉస్తాద్, రవి, సాజిద్, నాగన గౌడ, మహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయులను స్మరించుకోవడం బాధ్యత
కోలారు: మానవతా విలువలు కలిగిన మహనీయులను సదా స్మరించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి తెలిపారు. ఆదివారం నగరంలోని టి.చన్నయ్య రంగమందిరంలో బాబూ జగజ్జీవన్ రాం జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జగజ్జీవన్ రాం, అంబేడ్కర్ ఒక సముదాయానికి చెందిన వ్యక్తులు కాదు.. యావత్ దేశ అంతః సాక్షిని హెచ్చిరించిన మహా శక్తులు అని కొనియాడారు. జగజ్జీవన్ రాం తన వృత్తి, జీవనంలో అనుభవించిన బాధలు, ఎదుర్కొన్న సవాళ్లను స్మరించుకున్నారు. కఠిన పరిస్థితుల్లోనూ ఆయన ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ సీఈఓ ప్రవీణ్ పి.బాగేవాడి, డిప్యూటీ కలెక్టర్ మంగళ, అదనపు ఎస్పీ రవి శంకర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు


