హొసపేటె: అత్యంత కచ్చితమైన, స్పష్టమైన సమాచారంతో క్రమ పద్ధతిలో డేటాను సేకరించి, రాబోయే జనగణనను విజయవంతం చేయాలని జిల్లాధికారిణి కవిత ఎస్. మన్నికేరి సూచించారు. బుధవారం నగరంలోని పీడీఐటీ కళాశాలలో గణన సిబ్బంది, పర్యవేక్షకుల కోసం ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. ఈ సారి జనగణన పూర్తిగా డిజిటల్‌గా నిర్వహిస్తున్నందున, గణన సిబ్బంది తమకు అందించిన మొబైల్ యాప్‌ను సరిగ్గా ఉపయోగించుకోవాలన్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే, వెంటనే సాంకేతిక బృందం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలన్నారు.
రోజు వారీ ప్రగతిని అప్‌లోడ్ చేయాలి
రోజు వారీ పురోగతిని అదే రోజు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆమె అన్నారు. గణన అధికారులు ప్రజల ఇళ్లకు వెళ్లినప్పుడు వారు మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, జనగణన ఉద్దేశ్యాన్ని వారికి వివరించి ఒప్పించాలన్నారు. ప్రజలు కూడా సంయమనంతో కచ్చితమైన, స్పష్టమైన సమాచారాన్ని అందించాలన్నారు. ప్రజలు అందించిన సమాచారం గోప్యతను కాపాడుతామని అన్నారు. జెడ్పీ సీఈఓ నోంగ్‌జాయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా, ఏడీసీ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శివకుమార్, పట్టణాభివృద్ధి ప్లానింగ్ డైరెక్టర్ మనోహర్, ఫీల్డ్ ఈఓ శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు, ఆశా కార్యకర్తలు హాజరయ్యారు.
అధికారులకు జిల్లాధికారిణి సూచన
మూడు రోజుల శిక్షణ కు శ్రీకారం


