హుబ్లీ: వివిధ కారణాలతో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకు ఖాకీలు అండదండగా నిలిచారు. గంగావతిలో ఈ మేరకు అలాంటి వృద్ధులను గుర్తించి వారికి సాయంగా నిలబడ్డారు. తొలిసారిగా గంగావతిలో ఆసరా– 2026కు పోలీస్ అధికారులు శ్రీకారం చుట్టారు. గంగావతి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గంగావతి సబ్ డివిజన్ పరిధిలోని కుష్టిగి, కనకగిరి, గంగావతి, రూరల్, టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 41 మంది వృద్ధులను గుర్తించి పోలీసులే వారికి అన్ని విధాలుగా అభయ హస్తం అందించారు.
మనోధైర్యం పెరిగేలా ఆశాకిరణ
వృద్ధుల భద్రతతో పాటు వారిలో మనోధైర్యం పెరిగేలా ఆశాకిరణ ఆసరా– 2026ను ప్రారంభించినట్లు డీఎస్పీ న్యామేగౌడ తెలిపారు. సంతానం లేని, భర్త చనిపోయిన, పిల్లల నిరాదరణ తదితర కారణాలతో ఒంటరిగా నివస్తున్న వృద్ధులకు పోలీసులే వారి సంతానంగా నిలబడి వారిలో మనోస్థైర్యం నింపారు. ఈ మేరకు వృద్ధులకు ఒక్కొక్క కానిస్టేబుల్‌ను నియమించి వారి సాధకబాధకాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సానుకూలంగా స్పందిస్తామన్నారు. ఒంటరి జీవితం గడిపే వృద్ధులు తాము అనాథలమన్న సంకుచిత భావానికి స్వస్తి చెప్పాలన్నారు.
పోలీస్ ఆసరా లబ్ధి పొందాలి
పోలీస్ ఆసరా కార్యక్రమాన్ని చక్కగా ఉపయోగించుకొని పోలీస్ ఫోన్ నంబర్లకు తమ సమస్యలను తెలుపుతూ పరిష్కారం కోసం సహకరించాలన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. చాలా మంది వృద్ధులు తమకు నెల వారి పింఛన్ రాలేదని మొర పెట్టుకోగా వెంటనే రెవెన్యూ అధికారులకు పోలీసులు ఫోన్ చేసి పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత వృద్ధులందరికీ పండ్లు, ఫలహారాల కిట్‌ను పంపిణీ చేశారు. సీఐలు రంగప్ప దొడ్డమని, సుధీర్, వీ.నారాయణ, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.


