బళ్లారిఅర్బన్: సాంప్రదాయ అరేంజ్డ్ మ్యారేజ్ ప్రాధాన్యతను ప్రతిబింబించే బీజీఎం చిత్రం షూటింగ్‌కు బుధవారం బళ్లారిలో ఘనంగా శ్రీకారం చుట్టారు. బళ్లారి నగర ప్రజల ఆరాధ్య దైవం దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో మేయర్ పూజారి గాదెప్ప యాదవ్ చేతుల మీదుగా చిత్రీకరణ ప్రారంభమైందని చిత్ర దర్శకుడు రమేష్ భీమరాయప్ప తెలిపారు. బుధవారం పత్రికా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ చిత్రం రామాయణం నేపథ్యాన్ని స్పృశిస్తూ త్రికోణ ప్రేమకథగా రూపొందుతోందన్నారు. సినిమా షూటింగ్ బళ్లారి నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలు, బెంగళూరులో కొనసాగుతుందన్నారు. సుమారు వందకు పైగా చిత్రాలకు పాటలు రాసిన కిన్నాళ్ రాజు ఈ చిత్రానికి గీతాలు రచిస్తున్నారు. దినేష్ నాయక్ హీరోగా నటిస్తుండగా, సంభాషణలు, కథను బెంగళూరుకు చెందిన మల్లికార్జున అందిస్తున్నారు. పూజా కొట్టూరు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. శ్రీచక్ర ఫిలింస్ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశ్ పర్వ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాబోయే ఆగస్టు నెలలో గణేశ్ పండుగ సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. హీరో, హీరోయిన్‌తో పాటు చిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.


