సాక్షి,బళ్లారి: నెల రోజులు కఠిన నియమాలతో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేళ ఉపవాస దీక్షలను భక్తిశ్రద్ధలతో విరమించారు. శనివారం పరమ పవిత్రమైన రంజాన్ పండుగను ముస్లిం సమాజ బాంధవులు భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకున్నారు. కొత్త బట్టలు ధరించి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఈద్ ముబారక్ అంటూ సంతోషంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద దానాలు చేస్తూ దానం గుణం చాటారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదులు, ఈద్గాల వద్ద పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు చేరి సామూహిక ప్రార్థనలు చేసి, ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు
ముఖ్యంగా నగరంలోని బెంగళూరు రోడ్డుకు వెళ్లే ప్రాంతంలో వెలసిన అతి పెద్ద ఈద్గా మైదానంలో వేలాది మంది ముస్లిం సోదరులు చేరి సామూహిక ప్రార్థనలు చేశారు. నగరంలోని ముస్లిం సోదరులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనం తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొనడంతో ఈద్గా మైదానం వద్ద ఇసుక వేస్తే నేలరాలంతగా జనం సందడి కనిపించింది. మత గురువు సంప్రదాయబద్దంగా సామూహిక ప్రార్థనలు చేయించారు. అందరూ కూర్చొని నిశ్శబ్దంగా అల్లాను ప్రార్థిస్తూ ధ్యానంలో నిమగ్నమయ్యారు.
రంజాన్ పండుగకు గొప్ప విశిష్టత
రంజాన్ పండుగ గొప్ప విశిష్టత కలిగినదని, సహనం, నియమం, దయ, దానం, ఆధ్యాత్మికత మేళవింపుతో పండుగను ఆచరించడమే రంజాన్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా లోక్‌సభ సభ్యుడు తుకారాం, నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ నగరంలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, వారిని కలిసి సామూహిక ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో సామూహిక ప్రార్థనలు చేయడంతో ఈద్గా వద్ద గట్టి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
విజయనగరలో..
హొసపేటె: రంజాన్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. శనివారం విజయనగర జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం ఆయా ఈద్గా మైదానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మసీదులు, ఈద్గాల వద్దకు భారీగా తరలివచ్చి ఒకరికొకరు ఈద్‌ముబారక్ తెలుపుకుంటూ సోదర భావం చాటారు. ఉపవాస దీక్షల అనంతరం ఎంతో ఆసక్తిగా రంజాన్‌ను ఆచరించారు. మసీదులు, ఈద్గాలు ముస్లింలతో కిటకిటలాడాయి. నగరంలో ఐఎస్‌ఆర్ రోడ్డులోని ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాయచూరులో ..
రాయచూరు రూరల్: ముస్లిం సోదరులు శనివారం ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు జరిపారు. అత్యంత భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు మాట్లాడుతూ జిల్లాలో హిందువులు, ముస్లింలు అన్నదమ్ములుగా ఉన్నారన్నారు. మనమంతా ఒక్కటే అనే భావాన్ని చాటడానికి రంజాన్ పండుగ చేసుకోవడం నిదర్శనమన్నారు. జిల్లాధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, మాన్విలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్, యరగేరలో గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
బళ్లారిలో ఈద్గా వద్ద ముస్లింలకు ఎమ్మెల్యే భరత్‌రెడ్డి శుభాకాంక్షలు
రాయచూరులో ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనల్లో ముస్లింలు
ఈద్గాలు, మసీదుల్లో కిక్కిరిసిన
ముస్లిం సోదరులు
సామూహిక ప్రార్థనలతో పండుగను
ఆచరించిన వైనం
ఈద్గాల వద్ద నేతల సందడి,
ముస్లింలతో కలిసి ప్రార్థనలు


