సాక్షి,బళ్లారి: పవిత్రమైన రంజాన్ పర్వదినం రోజున అపశ్రుతి దొర్లింది. సామూహిక ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులపై తేనెటీగలు దూసుకొచ్చి మూకుమ్మడిగా దాడి చేశాయి. శనివారం రంజాన్ సందర్భంగా దావణగెరె జిల్లాలోని అనగోడు గ్రామంలో ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపు దూసుకొచ్చింది. పక్కనే పెద్ద ఎత్తున ఉన్న తేనెటీగల గూళ్లను ఆకతాయిలు కదిలించడంతో తేనెటీగలు ప్రవాహంలా ప్రార్థనలు చేస్తున్న వారిపైకి దూసుకొచ్చాయి. తేనెటీగలు పెద్ద సంఖ్యలో రావడంతో సామూహిక ప్రార్థనలు చేస్తున్న వారంతా లేచి పరుగులు తీశారు. ఆ క్రమంలో కొందరు కాలు జారి కిందకు పడిపోవడంతో కాళ్లు కూడా విరిగాయి. తేనెటీగల దాడిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడిలో 25 మందికి పైగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.
ఈద్గా మైదానం భీతావహం
సామూహిక ప్రార్థనలు చేసే ప్రాంతమంతా ఆందోళనకర వాతావరణంలా మారిపోయింది. వెంటనే స్థానిక పోలీసులకు, అధికారులకు తెలియడంతో హుటాహుటిన చేరుకుని గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తొక్కిసలాటలో కింద పడి కొందరు గాయపడి, తేనెటీగల దాడిలో కొందరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. తేనెటీగలు తీవ్రంగా కుట్టిన ఐదు మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. తేనెటీగల దాడి వల్ల శరీరంలో వాపులు, నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రి వద్ద గాయపడిన వారి రోదనలు మిన్నంటాయి. పవిత్ర ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆందోళన కలిగించగా, భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రంజాన్ నమాజ్ చేస్తుండగా
తేనెటీగల మూకుమ్మడి దాడి
25 మందికి గాయాలు,
ఐదుగురి పరిస్థితి విషమం
దావణగెరెలో మసీదు వద్ద
కలకలం రేపిన ఘటన


