హుబ్లీ: మగబిడ్డే కావాలన్న ఆశతో అత్యంత వెనుకబడిన యాదగిరి జిల్లాలో ఆడశిశువుల భ్రూణహత్యలు యథేచ్ఛగా జరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. పుట్టేది ఆడపిల్ల అని తేలడంతో 7 నెలల్లో 30 మంది గర్భస్రావం చేయించుకున్నారని నివేదిక వెల్లడించింది. ఆ జిల్లా జెడ్పీ సీఈఓ లబిష్ వరడియా సూచన మేరకు ఆడ శిశువుల భ్రూణ హత్యల దర్యాప్తుపై ఏర్పాటైన ఆరోగ్య శాఖ కమిటీ ఈ నివేదిక ఇచ్చింది. ఈ మేరకు 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జిల్లాలో 35 అబార్షన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటిలో 5 కేసులను వైద్యుల నివేదిక ఆధారంగా సహజం అని గుర్తించినా కూడా మిగిలిన 30 కేసుల్లో ఆడపిల్ల అన్న కారణంగానే అబార్షన్లు చేయించుకున్నారని తేలింది.
తెర వెనుక మరెన్నో కేసులు
శాఖా పరమైన దర్యాప్తులో ఈ 30 కేసులు వెలుగు చూసినా ఇలాంటివి ఎన్నో కేసులు తెరవెనుకే ఉండి పోతున్నాయి. చడీచప్పుడు లేకుండా ఆడ శిశువులను గర్భంలోనే చిదిమేస్తున్న ఘటనలు మానవాళికి మచ్చ తెస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 19న ఆ జిల్లా క్షయరోగ అధికారి డాక్టర్ సంజీవ్‌కుమార్ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసి ఉద్దేశపూర్వకంగా అబార్షన్ చేయించిన కేసుల నిగ్గు తేల్చాలని సూచించడంతో ఈ దారుణ వివరాలు వెల్లడయ్యాయి. మూడు, నాలుగు, ఐదు, అలాగే ఆరో సారి జననం తర్వాత మగబిడ్డ కావాలన్న ఆశతో గర్భవతులైన కొందరు మహిళలు పరీక్షల్లో ఆడపిల్ల అని నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి తదితర కారణాలతో అబార్షన్ చేయించుకున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లు
7 నెలల్లో 30 మంది గర్భస్రావాలు
ఆరోగ్య శాఖ కమిటీ నివేదికలో వెల్లడి
సదరు మహిళలు వైద్యుల సలహా లేకున్నా కూడా ప్రైవేట్ నర్సింగ్ హోంలలో అబార్షన్లు చేయించుకున్నారని దర్యాప్తులో తెలిసింది. జిల్లాలో కొందరు మహిళలు రాయచూరు జిల్లా ముదగల్, విజయపుర జిల్లా తాళికోటలో వైద్య పరీక్షలకు వెళ్లి అక్కడే అబార్షన్లు చేయించుకున్నారు. మరి కొందరు గర్భవతులు మహారాష్ట్రలో అబార్షన్లు చేయించుకున్నట్లు ఆ నివేదికలో తెలిపారు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కిట్ల అశాసీ్త్రయమైన విక్రయాలకు కళ్లెం వేయడం ద్వారా ఇలాంటివి అరికట్టవచ్చునని ఆ నివేదికలో సలహా ఇచ్చారు.


