రైతు సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమానికి పెద్దపీట

Mar 22 2026 2:01 AM | Updated on Mar 22 2026 2:01 AM

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తానని గురుమఠకల్‌ శాసన సభ్యుడు శరణేగౌడ పేర్కొన్నారు. శనివారం శాసన సభ్యుడి కార్యాలయంలో వ్యవసాయ రైతులకు వరి రాశులు చేసే యంత్ర పరికరాలను అందించి మాట్లాడారు. భవిష్యత్తులో రైతులు ఉత్తమ పంటలు పండించడానికి వ్యవసాయ శాఖాధికారులు సలహా సూచనలు, సహాయ సహకారాలు అందించాలన్నారు. వ్యవసాయ శాఖ నుంచి వచ్చే పథకాలను రైతులు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. రైతులకు సకాలంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సలహా, సూచనలివ్వాలని అధికారులను ఆదేశించారు.

బాలికపై లైంగిక వేధింపులు

పాఠశాల హెడ్మాస్టర్‌ అరెస్ట్‌

హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని నవలగుంద తాలూకాలోని ఓ గ్రామంలోని పాఠశాలలో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఫిర్యాదుకు సంబంధించి నిందితుడైన ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సదరు పాఠశాల గదిలో ఆ హెచ్‌ఎం పదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు దర్యాప్తు చేసి లైంగిక వేధింపులు పాల్పడిన హెచ్‌ఎంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అరెస్ట్‌ చేశారు.

ఆల్మట్టి–గదగ్‌ రైల్వే లైన్‌ పరిశీలన

రాయచూరు రూరల్‌: ఆల్మట్టి–గదగ్‌ రైల్వే లైన్‌లో విండో ట్రేలింగ్‌ పనులను హుబ్లీ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ బేలా మీనా పరిశీలించారు. పనుల తీరుపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఆల్మట్టి– వండాల మధ్య డబ్లింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రయాణికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాయచూరు– గిణిగేరా రైల్వే లైన్‌ పనులపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు.

యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వాలి

ఈ విషయంపై సీఎం,

డీసీఎంలను కోరతాం

యువతకు కేబినెట్‌లో చోటివ్వాలని ఢిల్లీకి వెళతాం

నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వెల్లడి

సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వాలని పార్టీ హైకమాండ్‌ను కోరుతామని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలుపొందిన 48 మంది యువ ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా యువకులకు అవకాశం ఇవ్వాలని చర్చించామన్నారు. సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామన్నారు. యువకులకు మంత్రి పదవి ఇస్తే పార్టీ మరింతగా బలోపేతం కావడానికి వీలవుతుందన్నారు. యువకులైన ఎమ్మెల్యేల్లో పార్టీ ఎవరిని ఎంపిక చేసినా ఫర్వాలేదన్నారు. మొదటి, రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారికి మంత్రి పదవి ఇస్తే పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళతారో తాము వివరిస్తామన్నారు. యువకులకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతామన్నారు. ఈ విషయాన్ని అవసరమైతే ఢిల్లీలో పార్టీ హైకమాండ్‌ దృష్టికి కూడా తీసుకెళతామన్నారు. రంజాన్‌ పండుగ సందర్భంగా నగరాన్ని సువర్ణ బళ్లారి కావాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్‌, పార్టీ ప్రముఖులు హుమయూన్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలకు ఇఫ్తార్‌ విందు

రాయచూరు రూరల్‌: జిల్లాలో ప్రజలు హిందూ, ముస్లిం అనే భేద భావాలను మరిచి సోదరులుగా మెలుగుతున్నారని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మహిళా సమాజ్‌లో రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో వారు పాల్గొని మాట్లాడారు. ఇదే సందర్భంగా పలు మసీదుల్లో కూడా ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందును అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement