గుంతకల్లు రూరల్: కలుషితాహారం తినడం వల్ల పది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల కథనం మేరకు.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా అశోక్ సిద్ధాపుర గ్రామానికి చెందిన దాదాపు 45 మంది భక్తులు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉగాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈనెల 19న అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో వసతి గదులు దొరక్క పోవడం, బయట అద్దె గదుల ధర భారీగా ఉండటంతో దిక్కుతోచని భక్తులు ఆలయం వెలుపలే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గడిచిన రెండు రోజులుగా వారు ఆలయ కేసరి సదనం ముందు భాగంలో సొంతంగా వంట వండుకొని తింటూ, రాత్రి ఆరు బయటే బస చేస్తున్నారు. శుక్రవారం పాయసంతో పాటు అన్నం, సాంబారు, వంకాయ కూర వండుకున్నారు. రాత్రికి అన్నం మాత్రమే వండుకొని ఉదయం చేసిన కూరలతో తిన్నారు. అయితే అర్ధరాత్రి ఒకరి తరువాత మరొకరికి కడుపునొప్పితో కూడిన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. కొద్దిసేపటిలోనే అస్వస్థతకు గురికావడంతో దాదాపు 10 మందిని వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు కూడా ఆస్పత్రికి చేరుకొని చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.


