సాక్షి,బళ్లారి: దావణగెరె జిల్లా న్యామతి తాలూకా గోవినకవి గ్రామ సమీపంలో తుంగభద్ర నదిలోకి కడదహట్టి గ్రామానికి చెందిన కార్తీక్(23) అనే యువకుడు ప్రమాదశాత్తు కాలుజారి పడి మృతి చెందాడు. ఈ ఘటనతో నదీ తీరంలో బంధు మిత్రుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన నది వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భారీ వర్షాలకు 32 మేకల మృతి
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని నవలగుంద పట్టణంతో పాటు ఆ తాలూకాలోని వివిధ గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు తిర్లాపురలో రెండు ఇళ్లు నేలమట్టం కావడంతో పాటు ఆ గ్రామానికి చెందిన నింగప్ప కరిగారకు చెందిన 21 మేకలు, సోమప్పకు చెందిన ఆరు మేకలు, నాగేష్‌కు చెందిన ఐదు మేకలు భారీ వర్షాల తీవ్రతకు మృతి చెందాయి. అంతేకాకుండా ఆ తాలూకాలో నాలుగు ఇళ్లకు నష్టం జరిగినట్లు అక్కడి అధికారులు పరిశీలనలో తేల్చారు.
ఆరోగ్యం ఎలా ఉంది?
కేజీఎఫ్: కేజీఎఫ్‌కు చెందిన విద్యార్థిని ప్రమాదంలో కాలు కోల్పోయి స్ట్రెచర్‌పైనే పదో తరగతి పరీక్ష రాసింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు సురేష్ కుమార్ శనివారం కేజీఎఫ్‌కు వెళ్లి విద్యార్థిని కుసుమను కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థిని కుసుమ ఆత్మవిశ్వాసం మెచ్చుకోదగినదన్నారు. ప్రమాదంలో కాలు కోల్పోవడం దురదృష్టకరమని తెలిపారు. విద్యార్థిని కుసుమను చూసి గర్వపడుతున్నానన్నారు. ఇలాంటి విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు.
అంతర్రాష్ట దొంగల అరెస్టు
మాలూరు: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన మాస్తి పోలీసులు వారి నుంచి రూ.13.50 లక్షలు విలువ చేసే 100 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన ఎస్.లల్లూ ప్రశాంత్ (34), తమిళునాడు నేకారపట్టికి చెందిన వి.జనార్దన్ (31) అరెస్టు అయిన నిందితులు. వీరిపై తమిళనాడు, ఆంధ్రలో 31కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇంటి దొంగతనం కేసుకు సంభందించి గతంలో మాస్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకుని కార్యాచరణ జరిపిన పోలీసులు చాకచక్యంగా అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేయడంలో సఫలమయ్యారు. పోలీసుల కార్యాచరణను ఎస్పీ కన్నికా సిక్రివాల్ కొనియాడారు.


