ఉసురు తీసిన అక్రమ సంబంధం | - | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన అక్రమ సంబంధం

Mar 17 2026 7:48 AM | Updated on Mar 17 2026 7:48 AM

యువకుడు దారుణ హత్య

రాయచూరు రూరల్‌ : మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్న ఓ యువకుడు హత్యకు గురైన ఘటన రాయచూరు తాలూకాలోని బుళ్లాపురలో జరిగింది. గ్రామానికి చెందిన ప్రాణేష్‌(23) అనే యువకుడిని దిన్ని గ్రామానికి చెందిన ప్రసాద్‌, మల్లికార్జున, మల్లేష్‌ హత్య చేశారని ఇడపనూరు పోలీసులు తెలిపారు. గత మూడు నెలలుగా ప్రసాద్‌ భార్యతో ప్రాణేష్‌ అక్రమ సంబంధం నెరుపుతున్నాడు. ఈ విషయం గ్రహించిన ప్రసాద్‌ తన సహచరులతో కలిసి ప్రాణేష్‌ హత్యకు ప్రణాళిక రచించాడు. ఆదివారం ప్రాణేష్‌ బుళ్లాపురలో ఉన్నట్లు తెలుసుకున్న నిందితులు అక్కడికి వెళ్లి ప్రాణేష్‌ను గొడ్డళ్లతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కల్తీ కల్లు విక్రేత అరెస్ట్‌

రాయచూరు రూరల్‌ : నగరంలో కల్తీ కల్లు, సీహెచ్‌ పౌడర్‌ విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పడమటి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ మంజునాథ్‌ వెల్లడించారు. సోమవారం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని రైల్వేస్టేషన్‌ వద్ద ఉద్యానవనంలో వంశీ, మహ్మద్‌ హాజీలను అరెస్ట్‌ చేశామన్నారు. వారి వద్ద నుంచి 63 లీటర్ల కల్తీ కల్లు, సీహెచ్‌ పౌడర్‌ను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

పక్షులకు నీటి తొట్టెల ఏర్పాటు

హొసపేటె: ఎండ తీవ్రత నుంచి పక్షులు, ప్రాణుల దాహార్తి తీర్చేందుకు నగరంలోని జంబునాథ్‌ నగర నివాసులు నడుం బిగించారు. వేసవిలో ఎండల తీవ్రతకు దాహంతో అలమటించే పక్షులు, ప్రాణుల కోసం నీటిని, ఆహారాన్ని అందించడం మానవత్వానికి, పర్యావరణ పరిరక్షణకు నిదర్శనంగా చెప్పవచ్చు. సోమవారం జంబునాథ్‌ నగర నివాసులు తమ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో, ఇళ్ల మేడ మీద, చెట్ల పొదల్లో ప్లాస్టిక్‌, మట్టి పాత్రలలో నీరు నింపి పెట్టి, వాటిని ప్రతి రోజూ శుభ్రం చేసి మారుస్తూ పక్షులకు, జంతువులకు దాహార్తిని తీర్చుతున్నారు. పక్షి ప్రేమికులు తమ చిన్నపాటి సహాయంతో వందలాది పక్షుల దాహాన్ని, ఆకలిని కూడా తీరుస్తూ మానవత్వాన్ని చాటారు.

పంచాంగం పంపిణీ

చెళ్లకెరె రూరల్‌: మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల సూచన ప్రకారం ఉగాది సందర్భంగా నగరంలోని పేద బ్రాహ్మణులకు పరాభవ నామ సంవత్సర సూర్య సిద్ధాంత పంచాంగాన్ని ఉచితంగా అందజేశారు. దివాన్‌ డాక్టర్‌ మాధవాచార్‌, బాలాజీ రావు, రమాదేవి, సుజాత, రక్షిత్‌, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

వ్యాపార మేళాతో

వ్యవహార జ్ఞానం వృద్ధి

హొసపేటె: తాలూకాలోని కడ్డిరాంపుర గ్రామంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో యాంకర్‌– మెట్రిక్యులేషన్‌, బిజినెస్‌ ఫెయిర్‌ అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. పాఠశాల ఎస్‌డీఎంసీ సభ్యులు ప్రశాంత్‌ మాట్లాడుతూ పిల్లలకు వ్యాపారం, వాణిజ్య వ్యవహారాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పిల్లలకు వ్యాపార జ్ఞానం పెరుగుతుందన్నారు. పిల్లలు వివిధ రకాల వాణిజ్యం, వ్యాపారాల గురించి జ్ఞానాన్ని పొందారు. జీపీ సభ్యుడు షణ్ముఖప్ప, శివనాయక్‌, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement