హుబ్లీ: రాష్ట్ర విద్యార్థులు, నిరుద్యోగులు, యువత వివిధ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర ఉత్తర ప్రాంత కార్యదర్శి దర్శన్ హెగ్డే తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 43 శాఖల్లో సుమారు 2,84,881 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిలో విద్యాశాఖలో సుమారు 93 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని తదితర సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నామని, సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.
దంపతుల గొడవ..
ఆపబోయి వ్యక్తి మృతి
● నిందితుని అరెస్టు
సాక్షి బళ్లారి: ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందన్న సామెత చందంగా దంపతుల మధ్య గొడవను ఆపపోయిన వ్యక్తి మరణించిన ఘటన చిత్రదుర్గలోని బుద్ధసర్కిల్ ప్రాంతంలో జరిగింది. సాదిక్‌ఉల్లా అనే వ్యక్తి తన భార్యతో రోడ్డుపై గొడవకు దిగాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న తాజ్‌పీర్(42) అనే వ్యక్తి భార్యాభర్తల మధ్య గొడవను ఆపబోయాడు. అయితే ఆగ్రహానికి లోనైన సాదిక్‌ఉల్లా మచ్చుకత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తాజ్‌పీర్‌ను వెంటనే చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో మృతుని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్యాభర్తల గొడవ చక్కదిద్దేందుకు ప్రయత్నించిన వ్యక్తి ప్రాణాలను కోల్పోవడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్లు జప్తు
హుబ్లీ: అక్రమంగా నిల్వ చేసిన వాణిజ్య వినియోగ గ్యాస్ సిలిండర్లను ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన సిద్దేశ్వర పార్కు శివసాగర్ హోటల్‌లో జరిగింది. సదరు అధికారులు పోలీసుల సహకారంతో ఆదివారం రాత్రి దాడి చేసి గ్యాస్‌తో నిండిన 25 ఫుల్ సిలిండర్లను కనుగొని స్వాధీనం చేసుకున్నారు. సదరు హోటల్ యజమాని సతీష్ బండిపై విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గోగ్యాస్ కంపెనీ ద్వారా సరఫరా అయ్యే ఆ సిలిండర్లను హోటల్‌లో అక్రమంగా నిల్వ చేశారు. ఇవి ఎక్కడ నుంచి సరఫరా అయ్యాయో ఆరా తీస్తున్నామని ఆహార పౌర సరఫరాల శాఖ అధికారి విజయ్‌కుమార్ తెలిపారు.
వినియోగదారుల
రక్షణకు పిలుపు
రాయచూరు రూరల్: జిల్లాలో వినియోగదారుల రక్షణకు నడుం బిగించాలని జిల్లా కోర్టు అదనపు ప్రధాన న్యాయమూర్తి స్వాతిక్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. అధికారులు ప్రస్తుతం వినియోగదారులకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సిలిండర్ల కొరత లేకుండా చూడాలన్నారు. కక్షిదారులు ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చన్నారు.
రూ.1603 కోట్ల బడ్జెట్
హుబ్లీ: జంట నగరాల పాలికె 2026–27వ సంవత్సరానికి గాను బడ్జెట్‌ను పన్నుల నిర్వహణ, అప్పీల్ స్థాయి సమితి చైర్ పర్సన్ మీనాక్షి వంటమూరి సోమవారం ప్రతిపాదించారు. ఈ మేరకు పాలికె సమావేశంలో ఆమె బడ్జెట్ వివరాలు వెల్లడించారు. మొత్తం రూ.1603.26 కోట్ల మేర ఈ బడ్జెట్‌లో జంట నగరాల సర్వతోముఖాభివృద్ధి, ప్రజాసంక్షేమ పథకాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. పాలికె వార్డుల అభివృద్ధి కోసం సభ్యుల నిధి ద్వారా రూ.120 కోట్లు, నగర నడిబొడ్డులోని చెన్నమ్మ సర్కిల్, ప్రతిమ ఆధునీకరణకు రూ.5 కోట్లను కేటాయించామన్నారు. పాలికె సభా భవనంలో జరిగిన ఈ బడ్జెట్ సమావేశంలో మేయర్ జ్యోతి పాటిల్, డిప్యూటీ మేయర్ సంతోష్ చవాన్, సభా నాయకుడు వీరేష్ అంచటగేరి, విపక్ష నేత ఇమ్రాన్ ఎలెగార, కమిషనర్ రుద్రేశ్ గాలి, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నదిలో స్నానానికెళ్లి
యువకుడు గల్లంతు
రాయచూరు రూరల్ : నదిలో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతైన ఘటన విజయపుర జిల్లాలోని ఇండి తాలూకా పడనూరులో జరిగింది. ఉదయం స్నానం కోసం నది వద్దకు వెళ్లిన అనిల్ పూజారి(23) నీటిలోకి దిగాడు. అయితే అక్కడ లోతుగా ఉండటంతో నీటిలో మునిగి ఈత రాక మరణించాడు. మృతుని ఆచూకీ కోసం నదిలో గాలించామని, ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇండి పోలీసులు తెలిపారు.


