గవర్నర్ ప్రసంగం.. ఆయన ఇష్టం
మైసూరు: గణతంత్ర దినోత్సవాలలో గవర్నర్ ప్రసంగ పాఠాన్ని సోమవారం అందజేస్తామని, కానీ గవర్నర్ దాన్ని చదువుతారా, లేదా మార్చుకుంటారా, వద్దా అనేది ఆయన ఇష్టమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ఆదివారం మైసూరు విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సర్కారు ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని చదవకపోవడం గురించి, ఆ తరువాతి పరిణామాల గురించి ప్రస్తావించారు. సర్కారు రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ తప్పక చదవాలని రాజ్యాంగమే నిర్దేశించిందని అన్నారు.
నేటి పరిణామాలపై ఉత్కంఠ
మరోవైపు సోమవారం ఉదయం బెంగళూరు మానెక్ షా మైదానంలో రిపబ్లిక్ డే ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇందులో గవర్నర్ గెహ్లాట్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రూపొందిస్తుంది. తమ సర్కారు విజయాలను, సంక్షేమ పథకాలను ఇందులో ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఘాటు విమర్శలు ఉండొచ్చు. ఈ ప్రసంగాన్ని గవర్నర్ గెహ్లాట్ చదువుతారా, లేదా మొన్న మాదిరిగానే సొంత ప్రసంగం చేస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఈసారి కూడా గవర్నరు ‘‘స్కిప్’’ చేస్తే సిద్దరామయ్య ప్రభుత్వం ఊరుకోబోదని, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఉద్యమమే చేస్తుందనే అనుమానాలున్నాయి.
శకటం గురించి మాట్లాడాం
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం కర్ణాటక నుంచి శకటం పంపడం గురించి ప్రభుత్వం ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది, సంబంధిత వ్యక్తులను సంప్రదించారని సీఎం సిద్దరామయ్య చెప్పారు. ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదన్నది అబద్ధమన్నారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల ఈదఫా ఢిల్లీ గణతంత్ర పరేడ్‌లో రాష్ట్ర శకటానికి చోటు దక్కలేదని మైసూరు ఎంపీ యదువీర్ ఒడెయార్ ఆరోపించడం తెలిసిందే. పరేడ్‌లో రాష్ట్ర శకటానికి అనుమతించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత, దీనిపై తాము సంప్రదించామనే సీఎం చెప్పారు. అయితే శకటం పాల్గొంటోందా, లేదా అనేది వెల్లడించలేదు.
జేడీఎస్ గెలవదు
జేడీఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదని సీఎం అన్నారు. కాంగ్రెస్‌పై జేడీఎస్ అధినేత దేవెగౌడ విమర్శల నేపథ్యంలో స్పందిస్తూ బీజేపీతో పొత్తు ఉన్నందున అధికారం వస్తుందని అనుకుంటున్నారన్నారు. జేడీఎస్, బీజేపీ రెండూ మెజారిటీని పొందలేవు. ఒకవేళ వచ్చినా, జేడీఎస్‌కు అధికారం దక్కదు అన్నారు. మేం అధికారంలో కొనసాగుతాం, ఎవరికి నాయకత్వమో హైకమాండ్ నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. ప్రజ్వల్, ఆయన తండ్రి రేవణ్ణల అరెస్టుల్లో తామెప్పుడూ జోక్యం చేసుకోము, పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. మేం ప్రజ్వల్‌ను, రేవణ్ణను ఎందుకు ద్వేషించాలి అని ప్రశ్నించారు.
గణతంత్ర స్పీచ్‌పై సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలు
మరికొన్ని గంటల్లో తేలిపోనున్న సస్పెన్స్
గవర్నర్ ప్రసంగం.. ఆయన ఇష్టం


