మోడల్ హౌస్‌కు నిప్పులో భరత్ రెడ్డి హస్తం!
సాక్షి బళ్లారి: బెళగల్ క్రాస్‌లోని జీస్క్యేర్‌లో ఉన్న మోడల్ హౌస్‌కు నిప్పు పెట్టడం వెనుక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి హస్తం ఉందని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన నగరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రీల్స్ చేయడానికి వెళ్లిన యువకులు ఇంటికి నిప్పు పెట్టారని ఎస్పీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. పెట్రోల్ ఉపయోగించకుండా అలాంటి మంటలు వ్యాపించడం సాధ్యం కాదన్నారు. అలాగే ఇల్లు పాడుపడిందని కూడా చెప్పడంలో అర్థం లేదన్నారు. ఏఎస్పీ రవి కుమార్ పోలీస్ వేషంలో ఉంటూ క్రిమినల్‌గా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తాము సమర్పించిన వీడియోల ఆధారంగా 8 మందిని అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. నిప్పు పెట్టి భయనక వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతో ఇలా చేశారన్నారు. బ్యానర్ రగడ, కాల్పుల ఘటనలో యువకుడు మృతి చెందితే కేసును సీఐడీకి ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, ఆయన ఆప్తుడు సతీష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. బళ్లారి బ్యానర్ రగడ, కాల్పులు, మోడల్ హౌస్‌కు నిప్పు పెట్టిన విషయాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తెలిపారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి, మాజీ లోక్‌సభ సభ్యుడు సన్న ఫక్కీరప్ప, కంప్లి మాజీ ఎమ్మెల్యే సురేష్ బాబు, మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేఎస్.దివాకర్, బీజేపీ ప్రముఖుడు ఉమరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నేతల ఇళ్ల వద్ద పటిష్ట బందోబస్తు
సాక్షి బళ్లారి: నగరంలోని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన రెడ్డి ఇంటి వద్ద జరిగిన బ్యానర్ రగడ, కాల్పుల ఘటన నేపథ్యంలో 20 రోజులుగా బళ్లారిలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. గొడవ సద్దుమనిగిందని భావిస్తున్న తరుణంలో గాలి జనార్ధన రెడ్డి, శ్రీరాములుకు చెందిన బెళగల్ క్రాస్‌లోని జీ స్క్వేర్ నూతన లేఅవుట్‌లో నిర్మించిన మోడల్ హౌస్‌పై దుండగులు పెట్రోలు, డీజిల్ పోసి కాల్చివేశారు. నగరంలో నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాల వద్ద గట్టి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని హవాంబావిలోని గాలిజనార్ధన్ రెడ్డి, శ్రీరాములు ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారి ఆస్తుల వద్ద బందోబస్తు కొనసాగుతోంది. అలాగే ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఇళ్లు, నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పోలీసు బలగాలను మొహరించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో పాటు కొప్పళ, విజయనగర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పోలీసులను బళ్లారికి రప్పించారు.
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన రెడ్డి ఆరోపణలు
రీల్స్ చేయడానికి వచ్చి నిప్పు పెట్టారని చెప్పడం హాస్యాస్పదం
కేసును సీబీఐకి అప్పగించాలి
మోడల్ హౌస్‌కు నిప్పులో భరత్ రెడ్డి హస్తం!


