చిన్నారి తల్లులు.. బతుకంతా చీకటి
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో మైనర్ బాలికల గర్భధారణ కేసులు పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో 2,320 మంది బాలికలు గర్భవతులైనట్లు శిశు సంక్షేమ సమితి తెలిపింది. శివమొగ్గ జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వం జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్రంలో మైనర్ బాలికల గర్భధారణ కేసులు గత సంవత్సరం 500 పైగానే నమోదయ్యాయి. శివమొగ్గ జిల్లాలో మూడేళ్లలో 163 మంది చిన్నారులు గర్భవతులయ్యారు. ఆ తరువాత తుమకూరు జిల్లాలో 113 కేసులు రికార్డయ్యాయి.
ఎంత జాగృతి చేపడుతున్నా..
బాలికల గర్భధారణను అరికట్టేందుకు సర్కారు ప్రతి జిల్లాలో శిశు సంరక్షణ సమితులను ఏర్పాటు చేసింది. 3 నెలలకొకసారి సమితి సభ్యులు సమీక్ష చేస్తుంటారు. రేడియోలో ఆకాశవాణి ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, వివిధ సంస్థల్లోనూ బాలికల సంరక్షణ, చిన్నవయసులో గర్భధారణ వల్ల వచ్చే ప్రమాదాలపై ప్రచారం సాగిస్తుంటారు. ఇంకా పలు విభాగాలు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాయి.
బాధితులకు సహాయక చర్యలు
బాధిత బాలికకు న్యాయపరమైన సలహాలు, కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇస్తున్నారు. 173 మంది ఎడ్యుకేటర్లు ఈ విధుల్లో ఉన్నారు. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక కార్యాచరణను రూపొందించారు. అలాంటి బాలికలకు ఆశ్రయ కేంద్రాల్లో వసతి కల్పించడం, 23 ఏళ్ల వరకు అవసరమైన సహాయం ఇస్తారు. కానీ ఫలితాలు ఆశించినస్థాయిలో ఉండడం లేదనే విమర్శలున్నాయి. గర్భం దాల్చిన బాలికల జీవితం ఆ తరువాత శిశువు పోషణ, కుటుంబ సమస్యలతో సతమతం అవుతుంది. ఇది కూడా ఎక్కువగా పేద కుటుంబాల్లోనే జరుగుతోంది.
రాష్ట్రంలో పెరుగుతున్న బాలికల గర్భధారణ కేసులు
మూడేళ్లలో 2,320 నమోదు
బాధ్యతలతో నలిగిపోతున్న బాల్యం
చిన్నారి బాలికలు ఇంటికి, సమాజానికి వెలుగు. కానీ ఆ వెలుగును ఆర్పేసే చేతులు పెట్రేగుతున్నాయి. బాల్య వివాహాలు, వంచన తదితరాల వల్ల బాలికలు మోసపోయి గర్భం దాలుస్తున్నారు. చదువు, ఆటపాటలు కరువై, జీవితంలో లక్ష్యాలను ఛేదించలేక నాలుగు గోడలకే బతుకు పరిమితం అవుతోంది. నేటి డిజిటల్ యుగంలోనూ బాలికల హక్కుల దోపిడీ జరుగుతోంది.
చిన్నారి తల్లులు.. బతుకంతా చీకటి
చిన్నారి తల్లులు.. బతుకంతా చీకటి
చిన్నారి తల్లులు.. బతుకంతా చీకటి
చిన్నారి తల్లులు.. బతుకంతా చీకటి


