రేపటి నుంచే నరేగా అసెంబ్లీ
శివాజీనగర: జనవరి 22 నుంచి 31వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాల్లో ఉపాధి హామీ (నరేగా) పథకంపై ప్రత్యేక చర్చ జరుగుతుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉభయ సభల సమావేశాలు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రసంగంతో ప్రారంభమవుతాయన్నారు. నరేగా పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది, ఈ సమావేశాల తరువాత బడ్జెట్ ఏర్పాట్లకు నాంది పలుకుతామన్నారు. కుర్చీ గొడవపై ఢిల్లీకి వెళ్తారా? అని విలేకరులు ప్రశ్నించగా హైకమాండ్ పిలిస్తే వెళతానని సీఎం అన్నారు. రాసలీలల కేసులో డీజీపీ రామచంద్రరావును సస్పెండ్ చేశామని తెలిపారు.
కేంద్రం లాక్కుంటే ఊరుకోం
అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హెచ్.కే.పాటిల్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ఈ సమావేశాల లక్ష్యమన్నారు. సమాఖ్య వ్యవస్థలో ప్రజల హక్కులను కేంద్రం లాక్కుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండబోదన్నారు. ఈ సమావేశాలను ఎవరూ ఆపలేరన్నారు. ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణకు ఒత్తిడి చేస్తామని చెప్పారు. జీ రాం జీ చట్టం వల్ల కలిగే నష్టాలను వివరిస్తామన్నారు.
31 వరకు శాసనసభ సమావేశాలు
ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం
చర్చిస్తాం: సీఎం సిద్దరామయ్య
రేపటి నుంచే నరేగా అసెంబ్లీ


