రోడ్డు భద్రతపై జాగృతి
మైసూరు: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా మైసూరులోని కోట ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఏసీపీ శివశంకర్ మాట్లాడుతూ పర్యాటకుల స్నేహి ఆటో డ్రైవర్లుగా ఉండాలని వారికి సూచించారు. పర్యాటకులతో మర్యాదగా నడుచుకోవాలని తెలిపారు. అలాగే 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ నియమాలపై జాగృతి ఫ్లెక్సీలను నెలకొల్పారు. మద్యం తాగి, ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని తెలిపారు.
మృగానికి చెరసాల
మైసూరు: బుద్ధిమాంద్యురాలైన మహిళపై అత్యాచారానికి పాల్పడిన కామాంధునికి చామరాజనగర జిల్లా సెషన్స్ ఎఫ్‌టీఎస్‌సీ–1 ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ఎస్‌జే కృష్ణ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. చామరాజనగరలోని 31వ వార్డువాసి శివమూర్తి దోషి. బాధితురాలు ఇంటి ముందు కూర్చొని ఉండగా నిందితుడు ఆమెను మభ్యపెట్టి తన ఇంటిలోకి పిలుచుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె బంధువులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సీఐ బీ.మహేష్ అతనిపై కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. సాక్ష్యాధారాలతో నేరం రుజువు కావడంతో సోమవారం జడ్జి ఈ మేరకు తీర్పు వెలువరించారు. ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూటర్ కే.యోగేష్ వాదించారు.
40 మూటల వక్కలు మాయం
తుమకూరు: రైతు ఎంతో కష్టపడి పండించిన వక్కలను దొంగలు ఎత్తుకెళ్లారు. తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకా నిట్టరహళ్లికి చెందిన వినయ్‌కుమార్ ఇంటిలో భద్రపరిచిన 40 బస్తాల వక్కలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంజనీర్‌గా పనిచేస్తూనే వక్కతోటను సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఇంట్లో నిల్వ చేసిన 265 వక్క మూటల్లో 40 బస్తాలను ఎవరో చోరీ చేశారన్నారు. ఒక్కో మూట బరువు 52 కేజీలని, దాదాపు 19 క్వింటాళ్ల వక్కలు పోయాయని వాపోయాడు. దీని విలువ దాదాపు 9.5 లక్షలు ఉంటుందని అంచనా. తాను కుటుంబంతో వేరే ఊరికి వెళ్లినప్పుడు ఈ నెల 16వ తేదీన చోరీ జరిగిందన్నాడు.
టెన్త్ ముందస్తు పరీక్షలు కట్టుదిట్టం
శివాజీనగర: ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్) ముందస్తు పరీక్షల ప్రశ్నపత్రం లీకేజ్ నేపథ్యంలో విద్యాశాఖ త్వరలో జరిగే పరీక్షలల్లో అక్రమాలు జరగకుండా చూడాలని నిర్ణయించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రెండో ముందస్తు సన్నాహక పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరుగుతాయి. ఈసారి ఉదయం 10 గంటలకు కాకుండా 11 గంటలకు పరీక్షలు ఆరంభమవుతాయి. విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచి తరగతులకు హాజరు కావాలి. ఉపాధ్యాయులు ప్రశ్నాపత్రాల లాగిన్ ద్వారా ఉదయం 9.30 గంటలకు డౌన్‌లోడ్ చేయాలి. ఆ తరువాత 10 గంటల్లోగా వాటిని ముద్రించాలి. 10.50 గంటల కంటే ముందు పరీక్షా హాల్‌కు పంపించరాదు. లీకేజీ జరిగితే ఆ పాఠశాల హెచ్‌ఎం, నోడల్ ఉపాధ్యాయుడు, బ్లాక్ విద్యాశాఖాధికారి, జిల్లా డిప్యూటీ డైరెక్టర్ బాధ్యులు అవుతారని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది. గత వారం జరిగిన ఎస్‌ఎస్‌ఎల్‌సీ ముందస్తు పరీక్షల్లో గణితం పేపర్ లీకై రచ్చ జరిగింది. సోషల్ మీడియాలోనూ పెట్టి రూ.100 కు అమ్ముకున్నారు.
రాఘవేంద్రుల చిత్రాన్నే వద్దంటారా?
యశవంతపుర: మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఫోటోను అభిమాని ఒకరు సీఎం సిద్ధరామయ్యకు ఇవ్వగా ఆయన తిరస్కరించారని, ఇది దారుణమని నటుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జగ్గేశ్ విమర్శించారు. ఈ మేరకు బెంగళూరులో కావేరి నివాసం వద్ద రాయర ఫోటోను ఇస్తున్న అభిమానులను తోసేస్తున్న సిద్దరామయ్య వీడియోను జగ్గేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాఘవేంద్రస్వామిని అవమానించిన వ్యక్తులకు గుణపాఠం తప్పదన్నారు. కోట్ల మంది భక్తులు స్వామివారిని పూజిస్తారు, భక్తితో వచ్చిన రాయర ఫోటోను తిరస్కరించిన మొదటి వ్యక్తి సిద్ధరామయ్య అని జగ్గేశ్ దుయ్యబట్టారు.
రోడ్డు భద్రతపై జాగృతి


