ఆస్తి కోసం అన్న కుమారులే కడతేర్చారు
దొడ్డబళ్లాపురం: ఆస్తి కోసం వృద్ధురాలిని ఆమె అన్న కుమారులే హత్య చేసిన సంఘటన బాగలకోటె జిల్లా జగదాళ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రవ్వ(80)కు, ఆమె అన్న కుమారుల మధ్య 11 ఎకరాలకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఈనెల 13న ఆ భూమిని సర్వే చేయడానికి అధికారులు వచ్చారు. ఈక్రమంలో ఏం జరిగిందో ఏమో చంద్రవ్వ ఘటప్రభా కాలువలోకి పడిపోగా ఆమె అన్నకుమారులు కాపాడి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే అంత్యక్రియలు గుట్టుచప్పుడు కాకుండా చేయడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చంద్రవ్వ అన్న కుమారులు 5మందిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు అంగీకరించారని పోలీసులు తెలిపారు. కాగా హతురాలు చంద్రవ్వ ప్రభులింగేశ్వర దేవాలయం ముందు దుకాణం పెట్టుకుని జీవిస్తోంది. తాను సంపాదించిన డబ్బుతో రూ.16 లక్షలు ఖర్చు పెట్టి దేవాలయానికి 20 కేజీల వెండితో తలుపులు చేయించింది.


