చెత్త ఊడ్చే యంత్రాలకు అంత ఖర్చా?
గతంలో పాలికె ప్రారంభించిన చెత్త ఊడ్చే వాహనాలు (ఫైల్)
బెంగళూరు నగరంలో చెత్త ఊడుస్తున్న యంత్రం
బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలోని ప్రధాన రోడ్లు, అనుబంధ రహదారుల్లో చెత్త ఊడ్చే యంత్రాలను అధికారులు అద్దెకు తీసుకోనున్నారు. అందుకుగాను రూ.613 కోట్లు చెల్లించనున్నారు. ఇంత ఖర్చు అవసరమా అని అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. నగరవాసులు చెల్లించే పన్నుల డబ్బును ఇష్టానుసారం ఖర్చుచేయడం సమంజసమా? అనే ప్రశ్న వినిపిస్తోంది. బెంగళూరులో ఎన్నికై న పాలకవర్గం లేకపోవడం అధికారులు చెప్పినట్లు ప్రభుత్వం తలూపుతోందనే ఆరోపణలున్నాయి. 45 యంత్రాలను తీసుకునే అవకాశముంది. ఏడేళ్లు చెత్త ఊడ్చడానికి పై మొత్తం చెల్లిస్తారు. చెత్త యంత్రాలకే ఇంత డబ్బు పోతే మిగతా అభివృద్ధి పనులు, ముఖ్యంగా గుంతల రోడ్ల మరమ్మతులకు నిధులు ఎలా అని మాజీ కార్పొరేటర్లు, నగరవాసులు సందేహం వ్యక్తంచేశారు.
అంత అవసరం లేదు
గ్రేటర్ బెంగళూరు పరిధిలో 12.87 లక్షల కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో ప్రధానమైన రోడ్ల పొడవు 1,682 కిలోమీటర్లు. ఇలాంటి రోడ్లలో మాత్రమే యంత్రాలను వినియోగించాలి. ఇందుకు పెద్దగా ఖర్చు కాదు, కానీ సందుల్లో కూడా యంత్రాలను వాడాలనుకోవడం అర్థం కావడం లేదని మాజీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో ఏడాదిలో 6 నెలలు వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో చెత్త ఊడ్చే అవసరం ఉండదు.
45 వాహనాలు..
7 ఏళ్ల అద్దెకు రూ.613 కోట్లు
గ్రేటర్ బెంగళూరు నిర్ణయంపై విస్మయం
పూణె, పాట్నా కంటే తక్కువే
ఇప్పటికే వేలాదిమంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ ఉంటే వారికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో ఊడ్చే యంత్రాలున్న వాహనాలతో పని సులభంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాత్రి వేళ కూడా శుభ్రం చేయవచ్చునని చెప్పారు. పూణె, పాట్నా వంటి నగరాలలోనూ ఈ పథకం ఉందని, అక్కడ కిలోమీటరుకు రూ.1290 వరకు ఖర్చు అవుతోందని, బెంగళూరులో కి.మీ.కు రూ.894 మాత్రమేనని చెప్పారు.
చెత్త ఊడ్చే యంత్రాలకు అంత ఖర్చా?


