హనుమ రథోత్సవం
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరం బిబి రోడ్డులోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో హనుమజ్జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆదిచుంచనగిరి పీఠాద్యక్షుడు నిర్మలానందనాథస్వామీజి ఆధ్వర్యంలో రథోత్సవం, శనక్కాయల పరుసను నిర్వహించారు. పరిసర గ్రామాల రైతులు తాము పండించిన జొన్నలు, శనక్కాయలు తదితర పంటలను ఎద్దుల బండిలో నింపుకొని వచ్చి స్వామివారికి సమర్పించారు. ఉదయం నుంచి ఆంజనేయస్వామికి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. సాయంత్రం మేళాతాళాల మధ్య ఉత్సవమూర్తిని తేరులో ఉంచి ఊరేగించారు.
ఇంటి నుంచే ఆదాయమంటూ.. రూ.34 లక్షల మస్కా
మైసూరు: ఇంటిలో కూర్చొని లక్షల రూపాయలను సంపాదించాలని అనుకున్న వ్యాపారి భారీగా లాసయ్యాడు. వివరాలు.. మైసూరు సిటీలోని విజయనగర 3వ స్టేజ్‌కు చెందిన వ్యాపారికి టెలిగ్రామ్ యాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. ఇంటిలో నుంచే దండిగా సంపాదించాలని ఉంటే తమను సంప్రదించాలని అందులో ఉంది. లింక్‌ను నొక్కి అందులోని నంబరుకు కాల్ చేశాడు. తాము చెప్పినట్లు పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆగంతకులు తెలిపారు. వ్యాపారి పలుమార్లు 34.62 లక్షలను వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు. లాభం, అసలు వెనక్కు తీసుకుందామని ప్రయత్నించగా, మరింత పెట్టుబడి పెట్టాలని మోసగాళ్లు ఒత్తిడి చేశారు. చివరకు వారి ఫోన్లు స్విచాఫ్ చేసుకోవడంతో బాధితునికి మోసం అర్థమైంది. సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆకర్షణీయం.. క్రిస్మస్ ట్రీ
కృష్ణరాజపురం: బెంగళూరులో క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. స్థానిక మాల్‌లో రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. నగరవాసులు ట్రీని సందర్శించి ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. నగరమంతటా పండుగ సంబరం కనిపిస్తోంది.
బాధితురాలిపైనే
పోలీసుల కేసు
దొడ్డబళ్లాపురం: ఆనేకల్‌లో డయాగ్నసిస్ సెంటర్‌లో పరీక్షలకు వెళ్లిన ఓ మహిళను రేడియాలజిస్టు అసభ్యంగా తాకి వేధించిన కేసు గత నెలరోజులుగా చర్చనీయాంశమైంది. బాధితురాలు పదే పదే ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు తిరిగి ఆమైపెనే న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. రేడియాలజిస్టు జయకుమార్ అనే వ్యక్తి తనను వేధించినట్టు బాధితురాలు వీడియోలతో సహా పోలీసులకు నెల కిందటే ఫిర్యాదు చేసింది, కానీ నిందితున్ని పిలిపించి ఉత్తుత్తిగా మందలించి పంపించారు. సీఐ తిప్పేస్వామి.. జయకుమార్‌కు అండగా ఉన్నాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఆమె ఆరోపణలు అవాస్తవమని పోలీసులు చెబుతున్నారు.
హనుమ రథోత్సవం


