పెళ్లిలో తుపాకీతో చిందులు
సాక్షి, బళ్లారి: పెళ్లి ఊరేగింపులో ఓ రౌడీషీటర్ తుపాకీ పట్టుకుని గాల్లోకి కాల్పులు జరుపుతూ చిందులేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. యాదగిరి జిల్లా గురుమిఠకల్ తాలూకా సిద్దాపుర గ్రామంలో పెళ్లి మెరవణి జరిగింది. ముండరిగి గ్రామ పంచాయతీ సభ్యుడు, రౌడీషీటర్ చంద్రశేఖర్ గన్ పట్టుకుని గాల్లోకి కాల్పులు జరుపుతూ నృత్యం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్థానిక పోలీసలు అతనిని అరెస్టు చేసి తుపాకీని సీజ్ చేశారు. అది నాటు తుపాకీ అని సమాచారం.
ఆర్‌సీబీ మ్యాచ్‌లన్నీ
బెంగళూరులోనే: డీసీఎం
శివాజీనగర: వచ్చే ఏడాదిలో ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి చెందిన అన్ని పోటీలు బెంగళూరులోనే జరుగుతాయని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. నగరంలోని కేఎస్‌సీఏ ఎన్నికలలో ఓటు వేసిన తరువాత ఆయన మాట్లాడారు. ఆర్‌సీబీ మనకు గర్వకారణం, ఐపీఎల్ మ్యాచ్‌లను ఇక్కడి నుంచి తరలించేది లేదు. ఆర్‌సీబీ టీం అన్ని మ్యాచ్‌లూ బెంగళూరులోనే జరుగుతాయి. దీనిపై నేను వారితో మాట్లాడతాను అని చెప్పారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం నూతన అధ్యక్షుడు, పదాధికారుల ఎన్నికలు జరగ్గా, మాజీ క్రికెటర్లు అనిల్‌కుంబ్లే, రోజర్ బిన్ని, బ్రిజేశ్ పటేల్ తదితర ప్రముఖులు ఓటు వేశారు. వెంకటేశ్ ప్రసాద్ కూడా పోటీలో ఉన్నారు.
డీకే ఆప్తునికి నోటీసులు
యశవంతపుర: నేషనల్ హెరాల్డ్ నిధుల కేసులో డీసీఎం డీకే శివకుమార్ ఆప్తుడు, కాంగ్రెస్ నాయకుడు ఇనాయత్ అలీకి ఢిల్లీ పోలీసులు (ఆర్థిక వ్యవహారాల విభాగం) నోటీసులిచ్చారు. ఈడీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఇనాయత్ అలీపై కేసు నమోదు చేసి త్వరలో విచారణకు రావాలని ఇంటికి వచ్చి నోటీసులిచ్చారు. ఇప్పటికే డీసీఎం సోదరులకు కూడా నోటీసులు రావడం తెలిసిందే. గత ఏడాది కాలం నుంచి ఈడీ అధికారులు అలీని విచారణ చేస్తున్నారు.
పెళ్లిలో తుపాకీతో చిందులు


