యోగా.. ఒంటికి ఆరోగ్యమేగా
సాక్షి బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మారిపోవడంతో పాటు ఆహార పదార్థాల్లో విషపూరితమైన మందులు వాడటంతో తినే ఆహారం విషంగా మారుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండటం సర్వసాధారణంగా మారింది. ఇటీవల ఆరోగ్యం వైపు దృష్టి సారిస్తూ మంచి ఆహారం తీసుకొని, శారీరక శ్రమ చేద్దామనుకునే వారికి సమయం దొరకక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆరోగ్యమే మహాభాగ్యమని భావించిన వారు తమకు తోచిన విధంగా యోగా, వాకింగ్ వివిధ రకాల క్రీడలను ఆడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల యోగా పట్ల రోజు రోజుకు ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆ దిశగా కొద్ది మంది మాత్రమే అడుగులు వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కృషి, పట్టుదల, ఆసక్తి ఉంటే కొంత సమయాన్ని యోగాకు కేటాయిస్తే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని, ఎక్కువ మంది యోగా పట్ల ఆసక్తి చూపేందుకు చొరవ తీసుకొని ఆ దిశగా ముందడుగు సాధించిన గ్రామం గదగ్ జిల్లా పాపనాసిగా చెప్పవచ్చు.
డాక్టర్ అశోక్ మత్తికట్టి చొరవ ఫలితం
ఈ గ్రామంలో యోగాలో అత్యంత నైపుణ్యత సంపాదించిన వారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది ఉన్నారు. గ్రామంలో ఆయుర్వేద డాక్టర్ అశోక్ మత్తికట్టి చొరవ తీసుకొని ఎంతో మందిని అద్భుత యోగా నిపుణులుగా తీర్చిదిద్దారు. 8వ తరగతి చదువుతున్న పూర్ణిమ కటిగార్ అనే విద్యార్థి తన శరీరాన్ని రబ్బర్ తరహాలో వివిధ భంగిమల్లో వంచుతూ అద్భుతమైన యోగా చేస్తూ కీర్తిని గడించింది. గండబీరుండాసనం, హనుమాసనం, వృశ్చికాసనం, మయూరాసనం తదితర ఎన్నో కఠినమైన ఆసనాలను వేస్తూ యోగాలో అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించింది. ఒక్క పూర్ణిమ కటిగారే కాకుండా పాపనాసి గ్రామంలో ఎంతో మంది విద్యార్థులు అద్భుతమైన యోగాసనాలు వేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొని గ్రామానికి కీర్తిని తీసుకొచ్చారు. ఐదు మంది విద్యార్థులు ఆళ్వాస్ విద్యా సంస్థలో యోగా ద్వారా ఉచిత సీట్లు సంపాదించడం గమనార్హం. గ్రామంలో విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు యోగా పట్ల ఆసక్తి చూపడంతో విద్యార్థులకు యోగా చదువుతో పాటు నైపుణ్యం సంపాదించారు.
సామూహిక యోగా సాధనలో మహిళలు
గ్రామంలోని మహిళలు యోగాలో మంచి ప్రావీణ్యతను సంపాదించడంతో పాఠశాల ఆవరణలోనే కాకుండా గ్రామంలో ప్రతి నిత్యం బృందాలుగా చేరి సామూహిక యోగాసనాలు చేస్తుండటం విశేషం. ఆయుర్వేద ఆస్పత్రిలో ప్రతి నెల యోగాకు సంబంధించి కార్యక్రమాలు చేస్తుండటంతో బీపీ, షుగర్, థైరాయిడ్‌లకు మందులు లేకుండా యోగా శిక్షణ ఇస్తుండటం గమనార్హం. ఆయుర్వేద యోగా పద్ధతిని ప్రజలకు తెలిపేందుకు 2020 నుంచి ప్రారంభమైన యోగా శిక్షణ దినదినాభివృద్ది చెందింది. ఆయుష్ కేంద్రంలో పనిచేసే అశోక్ మత్తిగట్టి ఆయుర్వేద వైద్యంతో పాటు యోగాసనాలను నేర్పిస్తూ గ్రామంలో వైద్య సంజీవినిగా మారారు. ప్రారంభంలో గ్రామస్తులకు యోగా పట్ల చైతన్యం తీసుకొని వచ్చి ప్రస్తుతం విద్యార్థుల్లో కూడా చదువుతో పాటు ప్రతి రోజు ఒక గంట సేపు క్రమం తప్పకుండా యోగా చేయిస్తూ ఆరోగ్యాలను పంపొందించడంతో పాటు మానసికంగా శక్తివంతులుగా తయారు చేస్తున్నారు. విద్యార్థులు యోగా పట్ల ఆసక్తి చూపిస్తూ ఆ దిశగా ముందడుగు వేస్తే ఖచ్చితంగా వారిలో మానసికంగా మనోధైర్యం వృద్ధికి, ఒత్తిడి నుంచి దూరం కావడానికి యోగా ఒక దివ్య ఔషధంగా పని చేస్తుందని నిరూపిస్తున్నారు.
యోగా శిక్షకులతో పిల్లలు, సాధకులు
రబ్బర్ తరహాలో శరీరాన్ని
వంచుతున్న యువత
రాష్ట్రంలోనే యోగా గ్రామంగా
పాపనాసికి గుర్తింపు
యోగా, ప్రాణాయామంతో వ్యాధులు దూరం
విద్యార్థులు పుస్తకాలు ఏవిధంగా పాఠశాలకు తీసుకెళ్తారో యోగా మ్యాట్లను కూడా వారి దగ్గర ఉంచుకుంటూ ప్రతి నిత్యం ఉదయం లేదా సాయంత్రం వేళల్లో యోగా చేస్తుండటం విశేషం. ఎలాంటి ముదురు రోగాలనైనా సైతం యోగా, ప్రాణాయామం ద్వారా దూరం చేయవచ్చని యోగా ద్వారా నిరూపించారు. పాపనాసి గ్రామం యోగా గ్రామంగా కీర్తి పొందుతోంది. ఈసందర్భంగా గ్రామంలోని పలువురు యోగాలో ప్రావీణ్యం సంపాదించిన విద్యార్థులు, గ్రామస్తులు మాట్లాడుతూ 2020 నుంచి తాము యోగా పట్ల ఆసక్తి చూపుతున్నామన్నారు. ప్రతి నిత్యం యోగాను తమ జీవన శైలిలో ఒక భాగంగా మార్చుకొని ముందుకు పోతున్నామన్నారు. పాఠశాలల్లో కూడా ఖచ్చితంగా యోగాను నేర్పిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యోగా అన్ని రోగాలను దూరం చేసే దివ్యఔషధమని సంతోషం వ్యక్తం చేశారు.
యోగా.. ఒంటికి ఆరోగ్యమేగా
యోగా.. ఒంటికి ఆరోగ్యమేగా
యోగా.. ఒంటికి ఆరోగ్యమేగా
యోగా.. ఒంటికి ఆరోగ్యమేగా
యోగా.. ఒంటికి ఆరోగ్యమేగా


