శిథిల భవనంలో విద్యార్థినుల వెతలు
కోలారు: కోటి ఆశలతో చదువుకుందామని వచ్చిన పేద బాలికలకు ప్రభుత్వ వసతి గృహాల్లో రక్షణ లేకుండా పోతోంది. శిథిల భవనాల్లోనే బిక్కుమంటూ చదువు కొనసాగించే పరిస్థితి. బంగారుపేట తాలూకా సూలికుంట గ్రామంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటూ 50 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికుల కుటుంబాల పిల్లలే. ప్రస్తుతం ఈ వసతి గృహం శిథిలావస్థకు చేరింది. పైకప్పు, గోడల నుంచి నిత్యం పెచ్చులూడి పడుతుండడంతో విద్యార్థినులు భయాందోళన నడుమ చదువులు కొనసాగిస్తున్నారు. హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా.. ఇక్కడ కనీస వసతులు కల్పించడం లేదు. భవన నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతోనే వర్షం కురిసినపుడు గోడల్లోకి నీరు చేరి పెచ్చులూడుతున్నాయని విద్యార్థినులు తెలిపారు. శౌచాలయాల్లో దుర్గంధం వస్తున్నా శుభ్రం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధులిస్తే మరమ్మతులు చేయిస్తాం
ప్రభుత్వ వసతి గృహం శిథిలమవుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం నిధులు కేటాయించిన వెంటనే గదులకు మరమ్మతులు చేయిస్తాం.
–శివకుమారి,
సాంఘిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్


