రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ కింద రెండో పంటకు నీరందించాలని ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి పేర్క్కొన్నారు. ఆదివారం సింధనూరు ప్రభుత్వ అతిథిగృహంలో ఎమ్మెల్సీలు ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ పంటకు నీరందించడానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలోని ఇంచార్జి మంత్రులు, శాసన సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు కలిసి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి రెండవ పంటకు నీరు వదలాలని కోరతామన్నారు.
కారు ఢీకొని వ్యాపారి మృతి
క్రిష్ణగిరి: మత్తూరు వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో జౌళి వ్యాపారి మరణించాడు. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా మత్తూరు సమీపంలోని జే.ఆర్.నగర్ ప్రాంతానికి చెందిన మాదయ్యన్ (48), అదే ప్రాంతంలో జౌళి వ్యాపారం నిర్వస్తున్నాడు. శనివారం సాయంత్రం వ్యాపారం ముగించుకొని ద్విచక్రవాహనంలో ఇంటికెళుతుండగా క్రిష్ణగిరి– తిరువణ్ణామలై హైవేలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలేర్పడిన మాదయ్యన్ అక్కడే మృతి చెందాడు. మత్తూరు పోలీసులు శవాన్ని ఆస్పత్రికి తరలించి కారు డ్రైవరుపై కేసు నమోదు చేశారు.
వైభవంగా మల్లయ్య ఉత్సవం
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో కొండ హొన్నకేరి మల్లయ్య ఉత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం మైలార నగరలో వెలసిన ఆలయంలో ప్రత్యేక పూజలు నెరవేర్చారు. రామనాళ దగ్గర నుంచి 16వ ఏడాది గొలుసులాగే కార్యక్రమం విజయవంతంగా చేశారు. ఉత్సవ మూర్తులను పల్లకీ సేవలో ఊరేగించారు.
నియమాలు పాటిస్తే
ప్రమాదాలు దూరం
రాయచూరు రూరల్: కేఎస్‌ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలని రాయచూరు డీఎస్పీ శాంతవీర పిలుపునిచ్చారు. శనివారం రాత్రి కేఎస్‌ఆర్టీసీ బస్సు ప్రాంగణంలో ఆర్టీసీ బస్ డ్రైవర్లనుద్దేశించి మాట్లాడారు. డ్రైవింగ్ చేసే సమయంలో మద్యపానం చేయరాదన్నారు. ఫోన్‌లో మాట్లాడుతూ బస్సును నడపరాదన్నారు. ట్రాఫిక్ నియమాలను అనుసరిస్తే ఎలాంటి ప్రమాదాలు సంభవించవన్నారు. ఎదురుగా వాహనాలు వస్తే వాటికి దారి ఇవ్వడం, సిగ్నల్స్‌ను చూసుకొని ముందుకు ప్రయాణించాలన్నారు. రాయచూరు ఆర్టీసీ డివిజనల్ కంట్రోలర్ చంద్రశేఖర్, పశ్చిమ పోలీస్ స్టేషన్ సీఐ మేకా నాగరాజ్, ట్రాఫిక్ ఎస్‌ఐ ఈరేష్ నాయక్‌లున్నారు.
కాలం చెల్లిన నగరసభలకు అధికారుల నియామకం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో కాలం చెల్లిన నగరసభలకు అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రాయచూరు నగర సభ సభ్యుల పదవీ కాలం నవంబర్ 2న ముగిసింది. సింధనూరు నగరసభ గత నెల 23న, దేవదుర్గ నగరసభ గతనెల 17న, లింగసూగూరు గత నెల 29న, ముదగల్ గత నెల 23న పదవీ కాలం ముగిసింది. మాన్వి నగరసభ నవంబర్ 10న, హట్టి నగరసభ నవంబర్ 9న ముగియనుంది. 2018లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు ఏడున్నరేళ్ల పాటు అధికారం చెలాయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలం ముగిసిన సభల్లో అధికారులను పరిపాలనాధికారులుగా నియమించడానికి కసరత్తుకు శ్రీకారం చుట్టనుంది.
రైలు నుంచి జారిపడిన
కర్ణాటక వాసి
గార్లదిన్నె: కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు చెందని చెన్నవీర అనే యువకుడు ఆదివారం రాత్రి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తూ గార్లదిన్నె మండలం కల్లూరులో రైల్వే స్టేషన్‌లో జారి కిందపడ్డాడు. కుడి కాలు పాదానికి తీవ్ర గాయమైంది. 108 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రుడిని అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రెండో పంటకు నీరందించాలి
రెండో పంటకు నీరందించాలి
రెండో పంటకు నీరందించాలి


