
గ్రామంలోకి పిల్ల చిరుత.. కాసేపటికి కన్నుమూత
మండ్య: జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని బోళెనహళ్ళి గ్రామంలోకి గురువారం ఉదయం సుమారు 7 నెలల వయసు ఉన్న ఆడ చిరుత పిల్ల వచ్చింది. అది అరుస్తూ ఉండడంతో జనం చుట్టూ పోగయ్యారు. అటవీ అధికారులు వచ్చి చిరుతను స్వాధీనం చేసుకుని తరలించారు. తల్లి చిరుత నుంచి విడిపోయిన పిల్ల నీరసంగా ఉందని తెలిపారు. అయితే కొంతసేపటికే అది చనిపోయింది.
కాలువలోకి దూకిన దంపతులు
యశవంతపుర: దంపతులు కాలువలోకి దూకిన ఘటన చిక్కమగళూరు సమీపంలోని లక్కవళ్లి భద్రా జలాశయం వద్ద జరిగింది. మృతులు శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా శంకరపుర గ్రామానికి చెందిన విఠల్ (48), భార్య గంగమ్మ (40). గురువారం దంపతులిద్దరూ లక్కవళ్లి సమీపంలోని జగదాంబ ఆలయానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని పక్కనే పారుతున్న భద్రా కాలువలోకి దూకడంతో గల్లంతయ్యారు. స్థానికులు చూసి సమాచారం ఇవ్వగా పోలీసులు, ఫైర్ సిబ్బంది కొన్ని గంటలపాటు గాలించారు, గంగమ్మ మృతదేహాన్ని వెలికితీశారు. విఠల్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్యాయత్నం చేసి ఉంటారని అనుమానాలున్నాయి.
కలబుర్గిలో ఓట్ చోరీ దర్యాప్తు
దొడ్డబళ్లాపురం: కలబుర్గిలో ఓట్ల చోరీ కేసులో సిట్ పోలీసులు 5 ఇళ్లలో సోదాలు చేసి వేల సంఖ్యలో ఓటర్ ఐడీలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ఆళంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందని కేసు నమోదు చేసి దాడులు నిర్వహించారు. రోజా కాలనీలో అష్పాక్, జుంజుం కాలనీలో నదీం, అక్రం, రామనగర కాలనీలో మహమ్మద్ జునైద్‌ల ఇళ్లలో తనిఖీలు సాగాయి. అక్రం అనే వ్యక్తి ఇంట్లో వేల సంఖ్యలో నకిలీ ఓటర్ ఐడీ కార్డులు లభించాయి. 15 మొబైళ్లు, 7 ల్యాప్‌టాప్‌లను కూడా పట్టుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీనే ఓట్ చోరీ ఆరోపణలు చేయడంతో సిద్దరామయ్య ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐటీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
50 గ్రాముల తాళి తస్కరణ
మైసూరు: బస్సు ఎక్కుతుండగా మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగలు చోరీ చేసిన ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల పట్టణంలోని బస్టాండ్‌లో జరిగింది. మండ్య జిల్లా మద్దూరువాసి ఇందిర అనే మహిళ మలెమహదేశ్వర బెట్టకు వెళ్లింది, తిరిగి వస్తూ కొళ్లెగాల బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా 50 గ్రాముల బరువైన బంగారు మంగళ సూత్రాన్ని ఎవరో దొంగలు తస్కరించారు. కొంతసేపటికి గమనించి వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బస్టాండ్‌లో పోలీసు ఔట్‌పోస్టు ఉన్నప్పటికీ సిబ్బందిని నియమించలేదు. అందువల్లే దొంగలు చెలరేగిపోతున్నారని, పోలీసులను నియమించి దొంగతనాలను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు.
రాజధానిలో ఘోరం.. యువతి హత్య
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో రోజురోజుకీ హత్యా నేరాలు అధికమవుతున్నాయి. అందులోనూ యువత క్షణికావేశంలో చిన్న విషయానికి ఆవేశానికి లోనై దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా యువతిని గొంతుకోసి హతమార్చిన సంఘటన శ్రీరాంపురలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రైల్వే ట్రాక్ వద్ద ఒక యువతిని బైక్‌పై తీసకువచ్చిన దుండగులు ఆమె గొంతుకోసి హత్య చేశారు. అయితే హతురాలి వివరాలు తెలిసిరాలేదు. శ్రీరాంపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. పోలీసులు ఆధారాలను సేకరించి గాలింపు చేపట్టారు.

గ్రామంలోకి పిల్ల చిరుత.. కాసేపటికి కన్నుమూత