
హెచ్‌డీ కోటెలో దొంగల లూటీ
మైసూరు: జిల్లాలోని హెచ్‌డీకోటె పట్టణంలో మూడు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. స్టేడియం బడావణె నివాసి, ఏఎస్‌ఐ కేకే మహదేవ, మొదటి రోడ్డు నివాసి పేపర్ శేషాద్రిల ఇళ్లలో బుధవారం రాత్రి జరిగింది. ఏఎస్‌ఐ మహదేవ ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి సుమారు రూ.30 లక్షల విలువ చేసే 250 గ్రాముల బంగారు నగలు, రూ.25 వేల నగదు, పేపర్ శేషాద్రి ఇంటిలో రూ.2.5 లక్షల విలువ చేసే 20 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు.
ఏఎస్‌ఐ మహదేవ హాసన్‌కు హాసనాంబ దేవస్థానం వద్ద బందోబస్తుకు వెళ్లారు. ఆయనతో పాటు భార్య, ఉపాధ్యాయిని లోలమ్మ కూడా హాసన్‌కు వెళ్లారు. ఈ సమయంలో దొంగలు పడి సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, తలుపులు, బీరువాలను బద్దలు కొట్టి చోరీ చేశారు.
ఇళ్లకు గొళ్లెం వేసి..
అలాగే పట్టణంలోని విశ్వనాథ కాలనీకి చెందిన కృష్ణ అనే వ్యక్తి ఇంటిలో రూ.1.20 లక్షల విలువ చేసే 10 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి, రూ.20 వేల నగదును దోచుకెళ్లారు. చోరీ చేసే సమయంలో దొంగలు చుట్టుపక్కల ఇళ్ల తలుపులకు గొళ్లాలు వేసి ఎవరూ బయటకు రాకుండా ఉండేలా చేయడం గమనార్హం. పోలీసులు చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించి విచారణ చేపట్టారు. ఇవి స్థానిక దొంగల పనా, లేక ఉత్తరాది చెడ్డీ ముఠాలు చేశాయా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఇటీవల శివమొగ్గ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ దొంగలు చోరీకి యత్నించడం సీసీ కెమెరాలలో రికార్డయింది.
నామకరణానికి వెళ్తే.. ఇల్లు ఖాళీ
● దొడ్డ రూరల్‌లో దోపిడీ
దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకా హొసహుడ్య గ్రామంలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. సోమణ్ణ అనే వ్యక్తి ఇంటి తలుపుల తాళం పగలగొట్టి చొరబడిన దొంగలు బంగారు, వెండి నగలతోపాటు నగదును దోచుకున్నారు. సోమణ్ణ మనవని నామకరణం వేడుక కోసం కుటుంబంతో కలిసి ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లారు. దీంతో దొంగలు చొరబడి 250 గ్రాముల బంగారు నగలు, 2 కేజీల వెండి సొత్తు, రూ.50 వేల నగదు, ఏటీఎం కార్డుల్ని దోచుకున్నారు. నగలు ఉన్న బాక్సులు, బ్యాగులను ఊరిచివరకు తీసుకెళ్లి సొత్తును తీసుకుని బ్యాగులను అక్కడే పారవేశారు. గురువారం ఉదయం సోమణ్ణ ఇంటికి వచ్చి చూసి లబోదిబోమన్నాడు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసు సహా ముగ్గురి ఇళ్లలో చోరీ
రూ.లక్షలాది బంగారం, నగదు అపహరణ

హెచ్‌డీ కోటెలో దొంగల లూటీ