
అయోధ్య రాముడికి 15 కేజీల వెండి ఇటుకల సమర్పణ
హుబ్లీ: రామ మందిరం కోసం దావణగెరెలో జరిగిన ఘర్షణలో బలి అయిన వారి పేరున వెండి ఇటుకలను అయోధ్య రాముడికి సమర్పించారు. 1930లో దావణగెరెలో శ్రీరామ జ్యోతి రథయాత్ర జరిగినప్పుడు మత కలహాలు చెలరేగిన ఫలితంగా పోలీసులు జరిపిన గోలీబార్‌లో 8 మంది రామ భక్తులు మృతి చెందారు. సుమారు 70 మందికి పైగా తూటాలతో పాటు మారణాయుధాలు, యాసిడ్ దాడులతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ మేరకు బలిదానం అయిన చంద్ర షిండే, శ్రీనివాసరావు, శివాజీరావు, రామకృష్ణ, దుర్గప్ప, చిన్నప్ప, అమరేష్, నాగరాజ్‌ల బలిదాన జ్ఞాపకంగా 15 కేజీల వెండి ఇటుకలను శ్రీరామ మందిరానికి అర్పించారు. ఆ సదరు ఇటుకల్లో శ్రీరాముడి, అయోధ్య రామ మందిరం చిత్రలేఖనం లిఖించారు. వాటిని రాముడి పాదాల ముందు పెట్టి పూజించాలని అయోధ్య రామ మందిర కమిటీకి విజ్ఞప్తి చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య కోశాధికారి ప్రముఖ సాధకులు ఆచార్య పరమపూజ్య గోవింద దేవగిరి మహారాజ్‌కు ఈ ఇటుకలను అందజేశారు. వీహెచ్‌పీ కర్ణాటక ప్రముఖులు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్టీ అయిన గోపాల్ ఈ అప్పగింత బాధ్యతలను పూర్తి చేశారు. విరక్తమఠం బసవప్రభుస్వామి సాన్నిధ్యంలో ఈ కార్యాన్ని నెరవేర్చారు. ప్రముఖులు యశ్వంత్‌రాజ్ జాధవ్, శివకుమార్, లోహిత్, భద్రావతి ఎన్‌టీసీ నాగేశన్న, కిరోసిన్ హాలేష్ తదితరులు పాల్గొన్నారు.