
రబీ పంటలకు నీరందించండి
సాక్షి బళ్లారి: తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని ఎల్‌ఎల్‌సీ, ఎల్‌బీఎంసీ కాలువల పరిధిలోని రైతుల ఆయకట్టు భూములకు రబీ సీజన్‌లో కూడా నీరు అందించాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తంగౌడ ఆధ్వర్యంలో పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు. శనివారం ఈమేరకు రైతు సంఘం నేతల ఆధ్వర్యంలో జిల్లాలోని సిరుగుప్ప ఎమ్మెల్యే నాగరాజును కలిసి వినతిపత్రాన్ని సమర్పిస్తూ రబీలో నీటి విడుదలకు సంబంధించి వివరాలు తెలియజేశారు. జూన్ 27న బెంగళూరులో జరిగిన తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి సమావేశంలో ఉపముఖ్యమంత్రి, పలువురు నిపుణులు ఈ విషయంపై చర్చించారని గుర్తు చేశారు. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు జనవరి వరకు నీటిని వదలాలని మనవి చేశారు. 40 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని గేట్లు మార్చాలని సూచించారు. తుంగభద్ర డ్యాం గేట్లు 33 అధ్వానంగా ఉన్నాయని, దీంతో గేట్లను మార్చే పనులు ఫిబ్రవరి నుంచి జూలై వరకు చేపడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.