
ట్రాఫిక్ ఉల్లం‘ఘనులు’
సాక్షి బెంగళూరు: దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న నగరం ఏంటి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ‘బెంగళూరు’.. ఐటీ సిటీ బెంగళూరులో చాలా వరకు రోడ్లు వాహనాలు, ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. పీక్ అవర్స్‌లో బెంగళూరులో ప్రయాణం అంటే అందరూ బెంబేలెత్తిపోవాల్సిందే. ఇదే సమయంలో అక్టోబర్ నెలలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు గుడ్‌బై చెప్పేసి తమ ఉద్యోగులకు కార్యాలయాలకు వచ్చి పని చేయాల్సిందే అని తేల్చి చెప్పాయి. ఈనేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ రద్దీ సమస్య ఒకవైపు అయితే ఇంకో వైపు ట్రాఫిక్ ఉల్లంఘనులు రోజురోజుకి బెంగళూరులో పెరిగిపోతున్నారు. ఎంతలా అంటే పదే పదే ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కుతున్న ఉల్లంఘనుల విషయంలో కూడా బెంగళూరు నగరం దేశంలోనే టాప్‌లో ఉండడం విశేషం. దేశ సురక్షత, భద్రత రంగ కంపెనీల్లో ఒకటైన ఏసీకేవో ఇటీవల నిర్వహించిన సమీక్షలో దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులు ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరులో వాహనదారులు పదేపదే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నట్లు సదరు కంపెనీ సర్వే నివేదికలో వెల్లడించింది. 2024 డిసెంబర్ నుంచి 2025 జూన్ వరకు దేశంలోని పలు మహానగరాల్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై సదరు సంస్థ సమీక్ష చేపట్టింది. బెంగళూరులోని వాహనదారుల్లో 10.8 శాతం కంటే ఎక్కువ మంది 10 సార్లకు పైగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానాలు చెల్లించిన వారుగా ఉన్నట్లు సమీక్షలో తేలింది. ఇది దేశంలోనే మహానగరాలన్నింటి కంటే అత్యధికం కావడం గమనార్హం. సమీక్షలో 14.50 లక్షలకు పైగా ట్రాఫిక్ పరీక్షలను నిర్వహించినట్లు, సుమారు 61 శాతం మంది అంటే ప్రతి పది మందిలో ఆరు మంది కనిష్టంగా ఒక్కటన్నా ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించినట్లు గుర్తించారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారే వీరిలో ఎక్కువగా ఉన్నారు. బెంగళూరులో పదేపదే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారుల ప్రమాణం 11 శాతంగా ఉంది. బెంగళూరు తర్వాతి స్థానాల్లో చైన్నె (8 శాతం), ఢిల్లీ (6 శాతం), ముంబై (5 శాతం), పుణే (3 శాతం) ఉన్నాయి.
సంచార నిబంధనల ఉల్లంఘనలో దేశంలోనే బెంగళూరు టాప్
వాహన రద్దీకే కాకుండా
జరిమానాల్లోనూ ఐటీ వాసుల అగ్రస్థానం
11 శాతం వాహనదారులు పది సార్లకు పైగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్
ఏసీకేవో కంపెనీ తాజా సర్వే నివేదికలో తేలిన కఠోర వాస్తవం
‘భారతదేశ టెక్ నగరంగా గుర్తింపు పొందిన బెంగళూరులో అనేక మంది ఇంకా ఇష్టానుసారం వాహనాలను నడుపుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్క జరిమానా కేవలం ఫైన్‌గా చూడకుండా నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేసేందుకు ఒక అవకాశంగా చూడాలి. ఈ సమీక్ష ద్వారా పదేపదే ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కేవారు తమ ప్రవర్తన మార్చుకుని బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేసి బెంగళూరును ట్రాఫిక్ నియమాల్లో ఒక ఆదర్శవంతమైన నగరంగా నిలబెట్టాలని ఆశిస్తున్నాము.’ –మయాంక్ గుప్తా, ఏసీకేవో ఉపాధ్యక్షుడు