
లాడ్జిలో మంటలు–ఇద్దరి మృతి
దొడ్డబళ్లాపురం: లాడ్జిలో అగ్నిప్రమాదం చోటుచేసుకొని పురుషుడు, మహిళ మృతిచెందారు. ఈ సంఘటన యలహంక న్యూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కిచన్–6 ఫ్యామిలీ రెస్టారెంట్ భవనం మూడవ అంతస్తులో ఒక లాడ్జి నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఒక గదిలో హఠాత్తుగా మంటలు చెలరేగి మిగతా గదులకు వ్యాపించాయి. లాడ్జి మొత్తం భారీగా పొగ కమ్ముకుంది. దీంతో ఓ గదిలో ఉన్న గదగ్ నివాసి రమేశ్ మంటలకు ఆహుతి కాగా హునగుంద నివాసి కావేరి ఊపిరి ఆడక మృతిచెందింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. పోలీసులు వచ్చి మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మంటలు ఎలా చెలరేగాయన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
మట్టణ్ణవర్‌పై మళ్లీ దర్యాప్తు?
● కొత్తగా ఫిర్యాదు చేసిన
ప్రశాంత్ సంబరగి
శివాజీనగర: ఎమ్మెల్యేల భవన్‌లో బాంబు పెట్టిన కేసుకు సంబంధించి గిరీశ్ మట్టణ్ణవర్‌పై మళ్లీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌కు, హోం శాఖ కార్యదర్శికి సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి ఫిర్యాదు చేశారు. మట్టణ్ణవర్ పలు వీడియోల్లో తానే బాంబు తయారు చేసి పెట్టినట్లు అంగీకరించినట్లుగా వ్యాఖ్యలు చేశారు. కేసును రీ ఓపెన్ చేసి ఎన్‌ఐఏ తనిఖీకి అప్పగించాలి. కేసు ఇప్పటికే న్యాయస్థానంలో మూసివేతకు గురైంది. అయితే కొత్త సాక్ష్యాధారాలను పరిగణించి మళ్లీ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని సంబరగి డిమాండ్ చేశారు. 2003లో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మట్టణ్ణవర్ ఎమ్మెల్యేల భవన్‌లో బాంబులను పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 13 ఏళ్ల తరువాత సిటీ సివిల్, సెషన్స్ కోర్టు ప్రధాన నిందితుడు మట్టణ్ణవర్‌తో పాటు ముగ్గురు నిందితులను తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించింది. కల్బుర్గిలో సబ్ ఇన్‌స్పెక్టర్ అయిన 26 ఏళ్ల వయస్సు కలిగిన మట్టణ్ణవర్‌పై రైఫిల్ షూటింగ్ శిక్షణ కోసం బెంగళూరుకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేల భవన్ ఐదో అంతస్తు మరుగుదొడ్డిలో నాలుగు బాంబులను ఉంచినట్లు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి.
గాజుల అలంకరణలో బనశంకరీదేవి
బనశంకరి: బెంగళూరు నగరవాసుల ఆరాధ్య దైవం బనశంకరీదేవి గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం వేకువజామున ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించారు. అనంతరం గాజులతో అలంకరణచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు.
ఎస్‌డీపీఐ నాయకుడి అరెస్ట్
యశవంతపుర: ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డీపీఐ) నాయకుడు రియాజ్ కడంబుకు ఉడుపి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు హిరియడ్య సబ్ జైలుకు తరలించారు. సంఘ్ పరివార్‌పై ద్వేషపూరితంగా వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. గత జూలైలో ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా కుంజాలు వద్ద గోవు తలను గుర్తించారు. ఇది ఒక కుట్ర అంటూ సంఘ్ పరివార్‌పై ద్వేషపూరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా, జూలై 15న ఉడుపి నగర పోలీసులు కేసు నమోదు చేశారు. గత కేసులో బెయిల్ మంజూరు చేసినా కోర్టు నియమాలను ఉల్లంఘించారంటూ మళ్లీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఉడుపి జిల్లా ఎస్పీ హరిరామ్ శంకర్ తెలిపారు.

లాడ్జిలో మంటలు–ఇద్దరి మృతి