
బీమా సొమ్ము కోసం అల్లుడి హత్య
దొడ్డబళ్లాపురం: బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి వరుసకు అల్లుడు అయ్యే వ్యక్తిని హత్య చేయించిన సంఘటన హావేరిలో చోటు చేసుకుంది. హావేరి జిల్లా రట్టిహళ్లి పట్టణ నివాసి బసవరాజు(38) హత్యకు గురైన వ్యక్తి. ఇతడి మేనమామ సిద్ధనగౌడ హత్యకు కుట్ర పన్నాడు. హత్యకు పాల్పడ్డ రాఘవేంద్ర, ప్రవీణ్, లోకేశ్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హతుడు బసవరాజుకు తల్లి, తండ్రి, తోడబుట్టినవారు అందరూ మరణించారు. ఒంటరిగా జీవిస్తున్న బసవరాజు మద్యానికి బానిసయ్యాడు. అతడి పేరున కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఆస్తులపై సిద్ధనగౌడ కన్ను పడింది. ఆస్తులను విక్రయించకుండా బంధువులు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. దీంతో సిద్దనగౌడ తానే డబ్బు చెల్లించి బసవరాజు పేరున యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు. కొంతకాలం తర్వాత సెప్టెంబర్ 27న బసవరాజుకు పీకలదాకా మద్యం తాగించి బైక్ ఇచ్చి ఇంటికి వెళ్లమని చెప్పాడు. తరువాత వెనుకనే కారులో వెళ్లిన సిద్ధనగౌడ, ముగ్గురు నిందితులు బైక్‌ను ఢీకొట్టారు. ప్రమాదంలో బసవరాజు మృతి చెందాడు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించి బీమా సొమ్ము కాజేయాలని సిద్ధనగౌడ ప్రణాళిక రచించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో కుట్ర కోణం వెలుగు చూడడంతో నిందితులను అరెస్టు చేశారు.

బీమా సొమ్ము కోసం అల్లుడి హత్య