
రేపిస్టుపై పోలీసు కాల్పులు
మైసురు : బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మైసూరు తాలూకా సిద్దలింగాపురగ్రామానికి చెందిన నిందితుడు కార్తీక్‌పై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈఘటన చామరాజనగర జిల్లాలో శుక్రవారం జరిగింది. కల్బుర్గి జిల్లా సుళ్తానపుర గ్రామానికి చెందిన ఆలెమారి సదామయానికి చెందిన దంపతులు తమ పిల్లలతో కలిసి మైసూరు దసరా వేడుకల్లో బెలూన్‌లు, ఆటల వస్తువులు విక్రయించేందుకు వచ్చారు. వస్తు ప్రదర్శన ప్రాధికార వద్ద ఇటుకులతో చిన్న గూడు ఏర్పాటు చేసుకొని రాత్రి అక్కడే నిద్రించేవారు. గురువారం ఉదయం దంపతులు నిద్రలేచిచూసేసరికి వారి పదేళ్ల కుమార్తె కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలించారు. అక్కడకు సమీపంలో బాలిక అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. శరీరంపై ఉన్న గాయాలను చూసి లైంగిక దాడికి గురైనట్లు గుర్తించారు. సీసీకెమెరాను పరిశీలించి నిందితుడు సిద్దలింగాపురగ్రామానికి చెందిన కార్తీక్ అని గుర్తించారు. నిందితుడు చామరాజనగర జిల్లా కొళ్లెగాలలో కారు పార్కింగ్ వద్ద నిద్రిస్తుండగా అదుపులోకి తీసుకొని మైసూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మూత్రవిసర్జనకు అని చెప్పి ఉడాయించేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు సర్వీస్ పిస్టల్‌తో కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ కార్తీక్ కాలిలోకి దూసుకెళ్లగా కుప్పకూలాడు. అనంతరం అతన్ని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. కాగా హత్యకు గురైన బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు. అరెస్ట్ అయిన నిందితుడు కోలుకున్న అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని మైసూరు నగర పోలీస్ కమిషనర్ సీమాలట్కర్ తెలిపారు.