
ఉద్యాననగరి.. కాలుష్య విహారి
యశవంతపుర: బెంగళూరులో స్వచ్ఛమైన గాలి దొరుకుతుందని ప్రజలు ఆశపడడం దురాశగానే ఉంటోంది. ఉద్యాననగరిగా పేరున్నప్పటికీ కనీసం ఓ మోస్తరుగానైనా మంచి గాలి లభించడం లేదు. విపరీతంగా కట్టడ నిర్మాణాల పనులు, పరిశ్రమలు, వాహనాల పొగ తదితరాల వల్ల కాలుష్యం చెలరేగుతోంది.
సెప్టెంబర్‌లో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖల మంత్రిత్వ శాఖ స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2025ను విడుదల చేసింది. ఇందులో సిలికాన్ సిటీ స్థానం మరింత అథోగతికి చేరింది. బెంగళూరు నగరం 28 స్థానం నుంచి 36వ స్థానానికి పడిపోయింది.
రోజురోజుకూ ప్రమాద ఘంటికలు
● ఆ శాఖలకు చెందిన ఎన్‌క్యాప్ విభాగం నిపుణులు దేశంలోని వివిధ నగరాలలో గాలి నాణ్యత మీద సమీక్ష చేశారు. బెంగళూరు గాలిలోని నాణ్యత రోజురోజుకు పడిపోతున్నట్లు ఆందోళన వెలిబుచ్చారు.
● 10 లక్షల కంటే అధికంగా జనసంఖ్య ఉన్న నగరాలు పలు చర్యల ద్వారా గాలి నాణ్యతలను పెంచుకున్నాయి. అయితే బెంగళూరులో ఈ చర్యలు ఫలించడం లేదు. ఇక్కడ ఒక ఘనపు మీటరు గాలిలో సాధారణం కంటే ఎక్కువగా దుమ్ము ధూళి కణాలు ఉంటున్నాయి. దాని వల్ల బెంగళూరు ర్యాంకు క్షీణించింది.
● గత నివేదికలతో పోలిస్తే 2026 నాటికి వాయు స్వచ్ఛత, ర్యాంకింగ్ మరింతగా పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వాహనాలదే పాపం
సిలికాన్ సిటీలో రోజుకు సుమారు 1.5 కోట్లకు పైగా వాహనాలు తిరుగుతూ పొగ వదులుతూ, దుమ్ము రేపుతూ ఉంటాయి. దీనివల్ల గాలిలోకి ప్రమాదకరమైన కార్బన్ మోనాకై ్సడ్, కార్బన్ డయాకై ్సడ్, నైట్రస్ ఆకై ్సడ్ వంటి వాయువులతో పాటు దుమ్ము, మసిని వెదజల్లుతూ ఉంటాయని నివేదికలో పేర్కొన్నారు. వాయు కాలుష్యానికి ప్రాథమికంగా వాహనాలు, రోడ్డుపై నుంచి వచ్చే దుమ్ము ధూళి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. అందుకే బెంగళూరులో శ్వాసకోశ జబ్బులు, కాలుష్య సంబంధ అనారోగ్యాలు అధికమయ్యాయి.
స్వచ్ఛ గాలి ర్యాంకింగుల్లో మరింత క్షీణత
గతేడాది 28వ స్థానం, ఈసారి 36
జనాభా, వాహనాల ఒత్తిడే కారణం
సౌకర్యాలను పెంచాల్సిందే
2025 ప్రారంభంలో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నిర్వహించిన ప్రగతి నివేదికలోని వాహనాల నుంచి వచ్చే పొగ, రోడ్ల దుమ్ముధూళి 40 శాతం కాలుష్యానికి కారణమవుతోందని తెలిపారు. ట్రాఫిక్‌ను నియంత్రించటంతో పాటుగా, ఉత్తమమైన రోడ్లు, సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 2024లో బెంగళూరు 170 పాయింట్లు సాధించి 28వ స్థానంలో ఉండగా, ఈసారి ర్యాంకు పడిపోవడం గమనార్హం. ఈదఫా 145 పాయింట్లే వచ్చాయి. పాలికె అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి మధ్య సహకారం లేకపోవడంతో పాటు కేంద్రం ఇచ్చే నిధులను సక్రమంగా ఉపయోగించటం లేదని నివేదికలో పేర్కొన్నారు.
భవిష్యత్తులో ముప్పే
విపరీతమైన జనాభా ఒత్తిడి, అలాగే వాహనాలు కాలుష్యంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు సర్వేలో తెలిపారు. ఈ సమస్యల మధ్య బెంగళూరు పాలన యంత్రాంగానికి నగరాన్ని మాలిన్య రహితంగా ఎలా తీర్చిదిద్దాలో దిక్కుతోచడం లేదనే చెప్పాలి. పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగ సృష్టికే బెంగళూరు పరిమితమైంది. స్వచ్ఛ గాలి దొరకడం లేదు, భవిష్యత్తులో బెంగళూరు ప్రజలకు ముప్పు తప్పదని పరిసరవాది విజయ్ నిశాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్యాననగరి.. కాలుష్య విహారి

ఉద్యాననగరి.. కాలుష్య విహారి