
బంధాలను తెంచేసిన ప్రేమపెళ్లి
బెళగావి (దొడ్డబళ్లాపురం): కన్నకూతురు తమను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుందన్న బాధతో తల్లిదండ్రులు ఆమెకు బ్రతికుండగానే శ్రాద్ధకర్మలు నిర్వహించిన బాధాకర సంఘటన బెళగావి జిల్లా రాయభాగ తాలూకా నాగరాళ గ్రామంలో చోటుచేసుకుంది. తమ కూతురు ఇక చచ్చిపోయిందని కన్నవారు ప్రకటించారు.
ఊరొదిలిన ప్రేమపక్షులు..
వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన యువతి (19), స్థానిక యువకుడు విఠల్ బెస్తవాడి ప్రేమించుకున్నారు. ఇది తగదని తల్లిదండ్రులు ఆమెను మందలించినా పట్టించుకోలేదు. ఇటీవల ప్రేమ జంట ఊరు విడిచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. రెండుమూడు రోజులు వేచి చూసిన తండ్రి.. స్థానిక ఠాణాలో మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చాడు. తన కుమార్తె 9వ తేదీన చనిపోయిందని శనివారం ఇంటిలో భారీఎత్తున తిథిని నిర్వహించాడు. ఆమె ఫోటో, వివరాలతో ఫ్లెక్సీలను గ్రామంలో కట్టించాడు. పెద్దఎత్తున వంటకాలను వండి తిథి భోజనాలను జరిపించాడు. ఇది చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్నంత మాత్రాన కూతురు కాకుండా పోతుందా? అని కొందరు నిట్టూర్చారు.
వీధిన పడేసింది: తండ్రి
యువతి తండ్రి మాట్లాడుతూ తనకు నలుగురు కుమార్తెలు ఉన్నారని, ఈమె చివరి కుమార్తె అని చెప్పాడు. ఎంతో గౌరవంగా బతుకుతున్న తమ జీవితాలను ఆమె వీధినపడేసిందని, సంప్రదాయాన్ని మంటగలిపిందని వాపోయాడు. హిందూ చట్టం ప్రకారం ఆమెకు తమతో ఎటువంటి సంబంధం లేదని దస్తావేజు కూడా రాసుకున్నట్లు చెప్పాడు.
బతికి ఉండగానే కూతురికి శ్రాద్ధకర్మలు
బెళగావి జిల్లాలో ఓ తండ్రి ఆక్రోశం

బంధాలను తెంచేసిన ప్రేమపెళ్లి