
ప్రొఫెసర్ ఇంట్లో దోపిడీ డ్రైవర్ పనే
బెంగళూరు (బనశంకరి): ఎంతో నమ్మకంగా ఉన్న కారు డ్రైవరే దోపిడీదారుగా మారాడు, తన స్నేహితులతో కలిసి ఓ ప్రైవేటు కాలేజీ ప్రొఫెసర్ ఇంట్లో రూ.1.50 కోట్ల నగదు, 50 గ్రాముల బంగారు ఆభరణాలు దోచేసిన 7 మందిని యలహంక పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.1.27 కోట్ల నగదు, రెండు కార్లు, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. శనివారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
తనిఖీల పేరుతో బెదిరించి
నిందితులు ఆర్‌ఎంవీ రెండోస్టేజ్ రాజేంద్ర మునోట్ అలియాస్ రాజేంద్ర జైన్, విజయనగర చోళరపాళ్య శ్రీనివాస్, శ్రీనగర కిరణ్‌కుమార్ జైన్, శ్రీరాంపుర హేమంత్‌కుమార్ జైన్, దుమ్మలూరు బీడీఏ లేఔట్‌వాసి శంకరప్ప, రామమూర్తినగరవాసి శంకరప్ప, హైదరాబాద్ రామనగర్‌వాసి మోహన్‌గౌడ అలియాస్ జనార్దన్. నిందితులు గత నెల 19న యలహంక వినాయకనగర సింధీ కాలేజీ ప్రొఫెసర్ గిరిరాజ్‌కుమార్ ఇంట్లోకి చొరబడ్డారు. తాము ప్రభుత్వ అధికారులమని, మీ ఇంటిని తనిఖీ చేయాలని అతని భార్య, తల్లిని బెదిరించారు. పైన పేర్కొన్న మేరకు నగదు, బంగారాన్ని తీసుకుని కారులో ఉడాయించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి గత నెల 23 తేదీన సంజయ్‌నగరలో ఓ వ్యక్తిని అరెస్ట్‌చేశారు. రెండో వ్యక్తిని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె వద్ద రేణుమాకలపల్లి గ్రామంలో, బెంగళూరు విజయనగర చోళరపాళ్యలో మిగతా ఐదుమందిని పట్టుకున్నారు.
శంకరప్పే సూత్రధారి
కారు డ్రైవరే దుమ్మలూరు శంకరప్ప సూత్రధారిగా గుర్తించారు. ఇతడు ప్రొఫెసర్ కు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇంట్లో భారీగా డబ్బు, బంగారం ఉన్నట్లు గమనించి, మిగతావారితో కలిసి దోపిడీ చేశాడు. ఇతని మిత్రుడు జనార్దన్ రూ.55 లక్షలు హైదరాబాద్‌లో, రేణుమాకలపల్లి లోని ఓ ఇంట్లో 25.80 లక్షలను దాచి ఉంచాడు. నిందితుల ఇళ్లలో గాలించి రూ.1.27 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈశాన్య విభాగ డీసీపీ వీజే.సజీత్, యలహంక సీఐ ఎంఎల్.కృష్ణమూర్తి సిబ్బంది ఈ కేసును ఛేదించారు.
7 మంది ముఠా అరెస్టు
రూ.1.27 కోట్లు, కొంత బంగారం స్వాధీనం