
ఎలుగుబంట్ల ఖిల్లా.. బళ్లారి జిల్లా
సాక్షి,బళ్లారి: చారిత్రాత్మకంగా పేరుగాంచిన ఉమ్మడి బళ్లారి జిల్లా ఆసియాలోనే అత్యధికంగా ఎలుగుబంట్ల నిలయంగా ఉండటంతో పర్యాటకులతో పాటు జంతు ప్రేమికులను ఈ ప్రాంతాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎలుగుబంట్ల దాడుల్లో గత కొన్నేళ్లుగా పలువురు మృతి చెందడంతో పాటు, పలువురు గాయపడిన వారూ ఉన్నారు. రైతుల పంటలను విపరీతంగా ఎలుగుబంట్లు నాశనం కూడా చేసిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఎలుగుబంట్లపై ఎలాంటి దాడులు చేయకపోవడంతో పాటు వాటిని ప్రాణాలతో సురక్షితంగా పట్టుకుని సుదూరంలోని అటవీ ప్రాంతాలకు తరలిస్తూ, అటవీ ప్రాంతాల్లో ఉన్న ఎలుగుబంట్లు ఊరు చేరినప్పుడు అధికారులకు అప్పగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కరిడిధామ, గుడేకోటె ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతాల్లో ఎలుగుబంట్లకు నిలయంగా మారింది. వందలాది ఎలుగుబంట్లు(కరడిలు) ఉండటంతో అటవీ శాఖ అధికారులు వాటిని సంరక్షించేందుకు ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకున్నారు.
ఆసియాలోనే కరడిధామ, గుడేకోటెల్లో ఎక్కువ
వేలాది ఎకరాల్లో విస్తరించిన అటవీ ప్రాంత కొండల్లో ప్రధానంగా ఎలుగుబంట్లు నివసిస్తుండటంతో ఈ ప్రాంతాలకు కరడిధామ అని కూడా పేరుపెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలోనే కాకుండా యావత్ భారతదేశమే కాదు, ఆసియాలోనే ఉమ్మడి బళ్లారి జిల్లాలో అత్యధికంగా ఎలుగుబంట్లు నివసిస్తున్నాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దీంతో అటవీ ప్రాంతాల నుంచి ఎన్నోసార్లు ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడంతో పాటు పంటలు కూడా నాశనం చేస్తున్న సందర్భాలు అధికంగా ఉండటంతో ఎలుగుబంట్లు నివసించే అటవీ ప్రాంతాల్లోనే కాకుండా ఎన్నోసార్లు బళ్లారి నగరంలోకి కూడా ఎలుగుబంట్లు వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. కరడిధామ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లో ఎంతో నష్టం చేస్తున్నప్పటికీ వాటి బారి నుంచి ఎలా బయటపడాలన్న అవగాహనతో ఇటీవల జాగ్రత్తలు పాటిస్తూ రక్షణ పొందుతున్నారు. అటవీ ప్రాంతాల నుంచి బయటకు వచ్చినప్పుడు వాటిపై జనం దాడి చేయకపోవడంతో పాటు సురక్షితంగా ప్రాణాలతో పట్టుకుని అటవీ ప్రాంతాలకు అప్పగిస్తుండటంతో ఈ ప్రాంత ప్రజల్లో ఎలుగుబంట్ల రక్షణపై ఉన్న మక్కువను అర్థం చేసుకోవచ్చు.
ఎలుగుబంట్లు కనబడితే సురక్షితంగా పట్టివేత
కరడిధామ, గుడేకోటె చుట్టుపక్కల గ్రామాల్లో అప్పుడప్పుడు ఎలుగుబంట్లు గ్రామాల్లోను, పొలాల్లోనూ కనిపించడం పరిపాటిగా మారింది. దీంతో గ్రామస్తులంతా కలిసికట్టుగా వెళ్లి ఎలుగుబంట్లను పట్టుకోవడంలో నైపుణ్యత సంపాదించుకున్నారు. స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి సురక్షితంగా పట్టుకోవడం విశేషం. రైతులకు పంట నష్టం చేసినా, రైతులను గాయపరిచిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ వాటిపై దాడులు చేయకపోగా వాటి ప్రాణాలను కాపాడటంలో శ్రద్ధ వహిస్తున్నారు. అటవీ ప్రాంతాల నుంచి ఎలుగుబంట్లు బయటకు రాకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అటవీ ప్రాంతాల్లో దొరికిన పండ్లు, ఫలాలు, ఆకులు, అలుములు తదితర ఆహారం నచ్చక ఎలుగుబంట్లు రైతుల పొలాల్లో పంటలను తినడానికి, మేకలు, గొర్రెలు తదితర వాటిని తినేందుకు బయటకు వస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.
ఆహారం అందించే చర్యలు చేపట్టాలి
అటవీ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సరైన ఆహారం దొరకని సందర్భాల్లో అధికారులు వాటికి ఆహారం అందించే చర్యలు తీసుకుంటే జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఎలుగుబంట్ల భయంతో పొలాల్లో మంటలు వేసుకుంటామని, టపాసులు పేల్చుతామని అన్నారు. ఒకరిద్దరు వెళ్లబోమని, గుంపుగా వెళ్లడంతో ఎలుగుబంట్లు భయపడతాయని, నిత్యం పొలాల్లోకి వెళ్లాలంటే రక్షణ కవచాలను ధరించి వెళతామని, అయితే ఎలుగుబంట్లు కనబడిన వెంటనే వాటిని ఎలాగైనా చాకచక్యంగా పట్టుకుని అధికారులకు అప్పగిస్తామని పలువురు రైతులు పేర్కొంటున్నారు. అయితే అటవీ ప్రాంతాల నుంచి అవి బయటకు రాకుండా సంబంధిత అటవీశాఖ అధికారులు మరింత గట్టిచర్యలు తీసుకోవాలని, తమ పంట పొలాలకు నష్టం చేయడంతో పాటు ఎలుగుబంట్ల దాడుల్లో గురై ఎన్నోసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నామని, అటవీప్రాంతాల చుట్టు పటిష్టమైన కంచె తదితర రక్షణ కల్పించి వాటిని బయటకు రాకుండా చూడాలని కోరుతున్నారు.
రైతులకు అపార పరిమాణంలో
తప్పని పంట నష్టాలు
ఎలుగుబంట్ల దాడుల్లో
ఎంతో మంది మరణించిన వైనం
ఇటీవల అవగాహనతో
ఎలుగుబంట్లపై తగ్గిన దాడులు
దరోజీ కరడిధామతో పర్యాటకులు, సందర్శకులకు కనువిందు