
బాలికను బలిగొన్న సిటీ బస్
యశవంతపుర: బీఎంటీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల తరచూ ఘోరాలు జరుగుతున్నాయి. బస్సు ఢీకొన్న ప్రమాదంలో 9 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన బెంగళూరు మహలక్ష్మీ లేఔట్ 1వ స్టేజ్ సిగ్నల్ వద్ద జరిగింది. వివరాలు.. భావన (9) పాంచజన్య పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని. శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు పాఠశాల వదలగా ఇంటికి నడిచి వెళ్తోంది. సదరు సిగ్నల్ వద్ద బాలికను బీఎంటీసీ బస్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కాగా, చికిత్స పొందుతూ చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఘటన జరగ్గానే డ్రైవర్ బస్సును వదిలేసి పారిపోయాడు. మల్లేశ్వరం పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
బీఎంటీసీ డ్రైవర్‌కు మూర్ఛ
● తొమ్మిది వాహనాలను ఢీకొన్న బస్సు
బనశంకరి: సిటీ బస్సు వెళ్తుండగా డ్రైవర్‌కు మూర్ఛ వచ్చింది. దీంతో బస్సు అదుపు తప్పి ముందున్న వాహనాలను ఢీకొంది. ఈఘటన శనివారం చిన్నస్వామిస్టేడియం 9వ గేట్ వద్ద చోటుచేసుకుంది. మధ్యాహ్నం సమయంలో చిన్నస్వామిస్టేడియం సమీపంలో సిగ్నల్ వద్ద వాహనాలు నిలబడి ఉన్నాయి. ఆ సమయంలో అక్కడకు బీఎంటీసీ బస్సు చేరుకోగానే డ్రైవర్ మూర్ఛపోయాడు. దీంతో బస్సు ముందున్న కార్లు, నాలుగు ఆటోలు, బైక్‌ను ఢీకొని నిలిచిపోయింది. ఘటనలో తొమ్మిది వాహనాలు దెబ్బతినగా ఆటో డ్రైవరుకు తీవ్రగాయాలయ్యాయి. ఆటో, బస్సు డ్రైవర్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కబ్బన్‌పార్కు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
విజయపురలో భూప్రకంపనలు
సాక్షి బళ్లారి: విజయపుర జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. శుక్రవారం రాత్రి 11 గంటల పైనా జనం నిద్రలో ఉన్న సమయంలో జిల్లాలోని తికోట, విజయపుర గ్రామీణ ప్రాంతాల్లో 12 కిలోమీటర్ల భూమి స్వల్పంగా కంపించింది కవళిగి, మధుబావి, ద్యాబేరి, కగ్గోడ తదితర గ్రామాల్లో రిక్టర్ స్కేల్‌పై 2.8 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొందరు నిద్ర నుంచి మేల్కొని ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు వస్తుండడం సాధారణమైంది.
చిరుత దాడిలో రైతు మృతి
దొడ్డబళ్లాపురం: చిరుతపులి దాడిలో రైతు మృతిచెందిన సంఘటన హావేరి జిల్లా రట్టీహళ్లి తాలూకా కణవిసిద్ధగేరిలో జరిగింది. బీరేశ్ (28) అనే రైతు, తమ్ముడు బీరేశ్‌తో కలిసి పొలంలో మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఇంతలో ఓ చిరుత హఠాత్తుగా ఇద్దరిమీద కెగిరి దాడి చేసింది. గొంతు, తల మీద కొరకడంతో బీరేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ స్థానికులు జిల్లాస్పత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం బీరేశ్ చనిపోగా, తమ్ముడు కోలుకుంటున్నాడు.
ఇద్దరు అధికారుల సస్పెండ్
యశవంతపుర: హాసన్‌లో జరుగుతున్న హాసనాంబ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేవారికి వీఐపీ పాస్‌ల విధానాన్ని రద్దు చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. అయితే ఇద్దరు అధికారులు గుర్తింపు కార్డులు చూపించి దర్శనానికి వెళ్లారు. దీంతో ఆ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు కార్డులను దుర్వినియోగం చేసి దర్శనానికి వెళ్లడం సరికాదని, నిబంధనలు ఉల్లంఘించినందుకే ఆ ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడిందని రెవెన్యూశాఖ మంత్రి కృష్ణబైరేగౌడ మీడియాకు తెలిపారు.