
నవంబరు.. జాతకం తారుమారు?
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంటుంది. అప్పట్లో అనూహ్యంగా గెలిచి నాటకీయ పరిణామాల మధ్య సిద్దరామయ్య సీఎం అయ్యారు. చూస్తుండగానే రెండున్నరేళ్లు అయిపోతున్నాయి. ఈ క్రమంలో కుర్చీ మార్పు ఉంటుందా, ఉండదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
2.5 ఫార్ములా ఫలించేనా?
రెండున్నరేళ్లు సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని, ఆ తర్వాత రెండున్నరేళ్లు డీకే శివకుమార్ కుర్చీ ఎక్కుతారని అప్పట్లో జోరుగా ఊహాగానాలు సాగాయి. నవంబర్ 19 నాటికి 2.5 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో సీఎం మార్పు ఉండబోతుందని మళ్లీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో పలువురు మంత్రులను సాగనంపి, కొత్తవారికి చాన్సిస్తారనే ప్రచారం మొదలైంది. మంత్రిమండలిలో మార్పులు ఉంటాయని సిద్దరామయ్య కూడా చెప్పారు. దీంతో నవంబర్ లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవించనుందని చర్చ సాగుతోంది. సీఎం పదవి కోసం డిప్యూటీ సీఎం శివకుమార్, ఆయన మద్దతుదారులు ఆశాభావంతో ఉన్నారు. హైకమాండ్ నోరువిప్పడం లేదు.
మంత్రివర్గ మార్పుల సందడి
వచ్చే నెల మంత్రివర్గ మార్పు జరిగితే కొందరు కొత్త వారికి అవకాశం దక్కుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రిపదవి ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. కొందరు మంత్రులు పదవిని కాపాడుకోవడం కోసం కార్యాచరణకు దిగారు. నవంబర్ 20 లేదా 21న మంత్రివర్గ మార్పులకు ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. ఇలా ఒకవైపు మంత్రివర్గ పునర్వస్థీకరణ, సీఎం మార్పు వంటి అంశాలతో రాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్‌గా మారాయి.
ముఖ్యమంత్రి మార్పు కోసం డీకే శివకుమార్ వర్గం గట్టిగా వాదిస్తుంటే, వారి వ్యూహాలను అడ్డుకునేందుకు సీఎం మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అస్త్రాన్ని తీశారని సమాచారం. బిహార్ ఎన్నికలతో బిజీగా ఉన్న హస్తం హైకమాండ్ ఆ తర్వాత కన్నడనాడుపై దృష్టి సారించే అవకాశం ఉంది.
పూర్తి కానున్న 2.5 ఏళ్ల పదవీకాలం
పెను మార్పులపై డిప్యూటీ సీఎం
వర్గం ఆశలు
ధీమాగానే సీఎం సిద్దరామయ్య శిబిరం
గుంభనంగా హైకమాండ్

నవంబరు.. జాతకం తారుమారు?

నవంబరు.. జాతకం తారుమారు?

నవంబరు.. జాతకం తారుమారు?