కోర్టు 5వ అంతస్తు నుంచి దూకి నిందితుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కోర్టు 5వ అంతస్తు నుంచి దూకి నిందితుడు ఆత్మహత్య

Oct 10 2025 6:12 AM | Updated on Oct 10 2025 6:12 AM

కోర్టు 5వ అంతస్తు నుంచి దూకి నిందితుడు ఆత్మహత్య

కోర్టు 5వ అంతస్తు నుంచి దూకి నిందితుడు ఆత్మహత్య

బనశంకరి: బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టు ఆవరణలో బాలికపై లైంగిక వేధింపుల (పోక్సో) కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. గౌతమ్‌ (35) అనే వ్యక్తిపైన ఏప్రిల్‌లో ఆడుగోడి పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. దీంతో పోలీసులు అరెస్టు చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. చా ర్జిషీటు కూడా దాఖలు చేశారు. గురువారం కేసు విచారణ కోసం జైలు నుంచి గౌతమ్‌ ను సిటీ సివిల్‌ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు రాగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంతలో నిందితుడు హఠాత్తుగా 5వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. ఈ సంఘటన కోర్టు ఆవరణలో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. కేసు వల్ల విరక్తి చెంది ఇలా చేసి ఉంటాడని అనుమానాలున్నాయి. ఈ కేసులో అతనికి భద్రతగా ఉన్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.

కురుబలకు ఎస్టీ హోదాకు సీఎం సిఫార్సు: బొమ్మై

శివాజీనగర: కురుబ సామాజిక వర్గాన్ని ఎస్టీలోకి చేర్చేందుకు సీఎం సిద్దరామయ్య కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని బీజేపీ ఎంపీ బసవరాజ బొమ్మై చెప్పారు. తమ హయాంలోనే కుల గణన అధ్యయన నివేదిక వచ్చింది. దానిని మా ప్రభుత్వం ఆమోదించింది, కానీ అంతలోనే ఎన్నికలు వచ్చాయి, ఆ నివేదికను బట్టి సీఎం సిద్దరామయ్య కురుబలను గిరిజనుల్లోకి చేర్చాలని 2023 జులై 20న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారన్నారు. వాల్మీకులు, కురుబల మధ్య ఎలాంటి సమస్య రాదని, కానీ రిజర్వేషన్‌ను పెంచడం అంత సులభతరమైనది కాదన్నారు. బిగ్‌బాస్‌ స్టూడియోను బంద్‌ చేసే అధికారం కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఉందా? అని బొమ్మై ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్నీ దారి తప్పిపోతున్నాయని ఆరోపించారు.

లోకాయుక్త వలలో

ఆర్టీసీ అధికారి

మైసూరు: ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ.10 వేల లంచం తీసుకుంటుండగా కేఎస్‌ఆర్టీసీ సహాయక పాలనాధికారిని లోకాయుక్త పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. మండ్యకు చెందిన సంతోష్‌కుమార్‌ తండ్రి కేఎస్‌ఆర్టీసీలో పని చేసేవారు. ఆయన అకాల మృతితో ఆ ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలని కోరుతూ సంతోష్‌కుమార్‌ దరఖాస్తు చేసుకున్నారు. అతని ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపేందుకు మైసూరు నగరంలోని బన్నిమంటప వద్ద ఉన్న కేఎస్‌ఆర్టీసీ కార్యాలయ గ్రామీణ విభాగపు ఏఏఓ మంజునాథ్‌ రూ.10 వేల లంచం డిమాండ్‌ చేశారు. మంజునాథ్‌ ఆఫీసులోనే సంతోష్‌ కుమార్‌ నుంచి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేసుకున్నారు.

అదృశ్యమైన ఆర్‌ఐ బెళగావిలో!

శివాజీనగర: ఉన్నతాధికారుల వేధింపులకు విసుగెత్తి అదృశ్యమైన ఉత్తర కన్నడ జిల్లా కుమటా పురసభ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌ బెళగావిలో ఉన్నట్లు తెలిసింది. భ ట్కళలోని ఇంటి నుంచి మంగళవారం రాత్రి లేఖ రాసి పెట్టి అదృశ్యం కావడం తెలిసిందే. పురసభ ప్రధానాధికారి ఎం.ఆర్‌.స్వామి వేధిస్తున్నాడని లేఖలో ఆరోపించారు. ఆర్‌ఐ తల్లి భట్కళ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వెంకటేష్‌ ఇంటికి ఫోన్‌ చేసి తాను బెళగావిలో ఉన్నట్లు తెలిపారు. దీంతో భట్కళ పోలీసులు బెళగావి నగరంలోని మార్కెట్‌ ఠాణా పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంకటేష్‌ను స్టేషన్‌లో ఉంచారు.

మహిళ ఇంటిలో చోరీ

మైసూరు: మరణించిన భర్తను చూసేందుకు వేరే ఊరికి వెళ్లిన ఓ మహిళ ఇంట్లో దొంగలు పడి దోచుకున్నారు. మైసూరు నగరంలోని శ్రీరాంపురలో జరిగింది. వివరాలు.. శ్వేతారాణి అనే మహిళ భర్త కేరళలో పనిచేస్తూ అక్కడే చనిపోయాడు. దీంతో ఆమె కర్మకాండల నిర్వహణకు అక్కడకు వెళ్లారు. ఈ నెల 6న తిరిగి ఇంటికి తిరిగి రాగా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలు, అల్మరాలలో విలువైన వస్తువులు కనిపించలేదు. దొంగలు పడి బంగారు ఆభరణాలు, ప్లాటినం ఉంగరం, రూ.15 వేల విలువ చేసే విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారు. ఆమె కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement