
బీజేపీ పక్షనేత అశోక్ డ్రైవర్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బీజేపీ శాసనసభా పక్ష నేత ఆర్.అశోక్ కారు డ్రైవర్, పోలీసు ఉద్యోగి అయిన శరణగౌడ రామగోళ్ (33) ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. శరణగౌడ బెంగళూరు బ్యాటరాయనపుర బాపూజీ నగరలో కుటుంబంతో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య శైలశ్రీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య నగర సమీపంలో మాగడి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. శరణగౌడ వీఐపీ సెక్యూరిటీ వింగ్‌లో హెడ్ కానిస్టేబుల్, అలాగే డ్రైవర్‌గా ఉన్నాడు. ఏం జరిగిందో కానీ బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానిక పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అశోక్ ఆస్పత్రికి వెళ్లి శరణగౌడ మృతదేహాన్ని చూసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. శరణగౌడ చాలా మెతక మనిషి, మంచివాడని, బాధగా ఉందని చెప్పారు. తాను రెండు రోజులుగా బెంగళూరులో లేనని, ఇంతలో విషయం తెలిసి వచ్చానని అశోక్ మీడియాతో చెప్పారు.