
మేలుకోటెలో వానరాల బెడద
మండ్య: జిల్లాలోని ప్రసిద్ధ మేలుకోటె పుణ్యక్షేత్రంలో ఇటీవల కోతుల బెడద అధికమైంది. ఆలయానికి వచ్చే భక్తుల మీద దాడులకు పాల్పడుతున్నాయి. కోతులను పట్టుకుని అడవిలో వదిలేందుకు సహకరించాలని అటవీ శాఖ అధికారులకు పీడీఓ రాజేశ్వర్, జీపీ ఇన్‌చార్జి అధ్యక్షుడు జీకే కుమార్ లేఖ రాశారు. కోతుల దాడుల్లో పలువురు భక్తులకు రక్త గాయాలయ్యాయి. దీంతో గ్రామ ప్రజలు మేలుకోటె బంద్ చేపడతామని హెచ్చరించడంతో అధికారులు కోతుల కట్టడికి సరేనన్నారు. జీపీ అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ కోతుల బెడదతో గ్రామస్తుల ఆస్తిపాస్తులకు నష్టం వాటిల్లుతోందన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు కూడా భద్రత కరువైందన్నారు. ఈ నేపథ్యంలో కోతుల పట్టివేతకు నడుం బిగించినట్లు తెలిపారు.