
అవినీతి పీడీఓలపై చర్యలు తీసుకోండి
బళ్లారిఅర్బన్: అవినీతి పీడీఓలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు హనుమంత జీ.యలసంగి డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని సండూరు, కంప్లి, సిరుగుప్ప, కురుగోడు, బళ్లారి తాలూకాలోని సంబంధిత గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీఓలు) ప్రభుత్వ నిధులను సర్కారు పేరున చేపట్టిన అభివృద్ధి నిర్మాణ పనుల సాకుతో రూ.కోట్ల చొప్పున దోపిడీ చేస్తున్నారన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు ఆ పీడీఓల అవినీతిపై తగిన చర్యలు తీసుకొని 5 గ్యారెంటీ పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో తేల్చాలని అన్నారు. అంతేగాక వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ప్రతి రూపాయి సంబంధిత పేద లబ్ధిదారులకు చేరాలని అన్నారు. ఈ విషయంలో జెడ్పీ సీఈఓ తదితర అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. పీడీఓల నుంచి ప్రభుత్వ నిధులను తక్షణమే రికవరీ చేసుకోవాలని ఆయన ఒత్తిడి చేశారు. ప్రముఖులు, జిల్లా అధ్యక్షుడు కట్టెస్వామి, ఎంఏ సింధికర్, డాక్టర్ జావీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.