
పచ్చని నగరంగా మార్చడమే లక్ష్యం
రాయచూరు రూరల్: రాయచూరు నగరాన్ని పచ్చని నగరంగా తీర్చిదిద్దాలనే సదాశయమే ప్రధాన లక్ష్యమని నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో పేర్కొన్నారు. గురువారం మహాత్మ గాంధీ క్రీడామైదానంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, యువజన సేవా క్రీడా శాఖ, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో జరిగిన మారథాన్‌ను ప్రారంభించి మాట్లాడారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మారథాన్ ద్వారా యువకులు ప్రజలను చైతన్యపరుస్తారన్నారు. రహదారికిరువైపుల మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణకు ముందుండాలన్నారు. యువత దురలవాట్లుకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి సురేంద్రబాబు, వీరేష్ నాయక్, ప్రవీణ్ కుమార్, శాకీర్‌లున్నారు. మారథాన్‌లో గెలుపొందిన లింగణ్ణ, భూమిక, తిమ్మప్పలకు బహుమతులిచ్చి సన్మానించారు.