
జొన్నదంటుతో బెల్లం తయారీ
సాక్షి,బళ్లారి: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు అన్నది ఒక సినిమా పాట కాదు, నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో వినూత్న తరహాలో ఆలోచనలతో పాటు అందుకు తగ్గట్టు కృషి చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించడంతో పాటు ఇతరులకు స్పూర్తిగా, ఆదర్శంగా నిలుస్తారని చెప్పవచ్చని మహాలింగప్ప అనే రైతు నిరూపించారు. ఈ ఏడాది భారీ వర్షాలతో ఉత్తర కర్ణాటక పరిధిలో 25 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోవడంతో వేలాది మంది రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఎదురు చూస్తున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అదే ఉత్తర కర్ణాటక పరిధిలోని బాగల్‌కోటె జిల్లా రబకవి బనహట్టి తాలూకా సంగనహట్టి గ్రామానికి చెందిన మహాలింగప్ప అనే రైతు తనకు ఉన్న వ్యవసాయ పొలంలో 10 ఎకరాల్లో మెగా జొన్నలు విత్తారు.
వినూత్నంగా ఆలోచించడం వల్లే..
మూడు నెలల క్రితం విత్తిన జొన్న పంటకు అదృష్టవశాత్తు భారీ వర్షాల దెబ్బ కూడా ఈ ప్రాంతానికి అంతగా పడలేదు. అంతేకాకుండా రైతు కూడా వినూత్న తరహాలో ఆలోచించారు. జొన్నదంటు చెరుకు దంటు కంటే బలంగా ఉండటంతో పాటు ప్రారంభం నుంచి జొన్న దంటు తియ్యగా ఉండటంతో సదరు రైతు జొన్న దంటుతో బెల్లం తయారు చేసేందుకు శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తడవుగా జొన్నదంటును సంబంధిత వ్యవసాయ శాఖ అఽధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రయోగశాలకు కూడా పంపారు. జొన్నదంటులో అన్ని ఆరోగ్యకరమైన పదార్ధాలు ఉన్నాయని, చెరుకు దంటులో ఏవిధమైన బెల్లం తయారీకి పాకం వస్తుందో అదే తరహాలో జొన్నదంటులో కూడా ఉందని, బెల్లం తయారు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, చెరుకు దంటు కన్నా జొన్న దంటుతో తయారు చేసిన బెల్లం తియ్యగా, రుచిగా ఉందని ల్యాబ్‌లో తేలడంలో సదరు రైతు తన పొలంలోని జొన్న దంటుతో బెల్లం తయారు చేశారు.
దేశంలోనే సరికొత్త ప్రయోగం చేపట్టిన బాగలకోటె జిల్లా రైతన్న
బెల్లం కంటే తియ్యగా ఉంటున్న జొన్నదంటు
ఒక ఎకరంలో దాదాపు 700 కేజీల బెల్లం తయారు చేశారు. దీంతో జొన్న విత్తనాలతో జొన్నలు పండించడంతో పాటు బెల్లం కూడా తయారు చేయడం ద్వారా సరికొత్త ప్రయోగాన్ని చేసి విజయవంతం అయ్యారు. ఈ సందర్భంగా రైతు మహాలింగప్ప సాక్షితో మాట్లాడుతూ తన పొలంలో మెగా జొన్నలు విత్తామన్నారు. పంట ఏపుగా పెరగడంతో పాటు దంటు కూడా బలంగా రావడంతో జొన్న దంటుతో బెల్లం తయారు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఆ తర్వాత అన్ని విధాలుగా ల్యాబ్ పరీక్షలు కూడా చేసిన తర్వాత జొన్నలు పండించడంతో పాటు బెల్లం తయారు చేశామన్నారు. ఒక ఎకరా జొన్నదంటుతో 700 కేజీల బెల్లం తయారు చేయగలిగామన్నారు. దేశంలో ఇలాంటి తరహా ప్రయోగం తాను చేయడం గర్వకారణంగా ఉందన్నారు. రైతులు జొన్న పంటతో చెరుకు తరహాలో బెల్లం తయారు చేస్తే, రెండు విధాలుగా లాభాలు ఉంటాయని, ఇటు జొన్నలు పండటంతో పాటు అటు బెల్లం తయారు చేయవచ్చన్నారు.

జొన్నదంటుతో బెల్లం తయారీ