
పత్తికి మద్దతు ధర ప్రకటించరూ
రాయచూరు రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు పొలంలో వేసుకున్న పత్తి పంటకు నష్ట పరిహారం అందించడంతో పాటు మద్దతు ధర ప్రకటించాలని అఖిల భారత రైతు వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మల్లనగౌడ మాట్లాడారు. క్వింటాల్‌కు రూ.10 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించాలన్నారు. వర్షాలకు నష్టపోయిన పత్తి పంటకు ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు రద్దు చేయాలని కోరుతూ జిల్లాధికారి నితీష్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు.
ఏఈ ఆత్మహత్యాయత్నం
హుబ్లీ: ఉన్నతాధికారుల వేధింపులతో విసిగి వేసారి జీవితంపై విరక్తి పెంచుకున్న అసిస్టెంట్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొప్పళ జిల్లాలోని కిర్లోస్కర్ కర్మాగారంలో జరిగింది. కొప్పళ తాలూకా గిణిగెరా వద్ద ఉన్న కిర్లోస్కర్ ఫ్యాక్టరీలో బసవరాజ్ అడిగ అనే సహాయక ఇంజనీర్ ఈ ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిసింది.
పేదలకు ఇందిరా ఆహార కిట్లు
హుబ్లీ: రాష్ట్రంలో ఇకపై అన్న భాగ్య పథకంలో భాగంగా అదనంగా 5 కేజీల బియ్యానికి బదులుగా ఇందిరా ఆహార కిట్లను పంపిణీ చేయాలని సిద్దరామయ్య మంత్రివర్గం నిర్ణయించడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. సిద్దరామయ్య మంత్రివర్గం తీసుకున్న సదరు నిర్ణయంపై పేద ప్రజలు స్వాగతిస్తున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సంబంధిత మంత్రి హెచ్‌కే పాటిల్ విలేకరులకు వివరించారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు వారి కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా మూడు కేటగిరీలుగా విభజిస్తామన్నారు. ఒకరిద్దరు సభ్యులు ఉన్న కుటుంబంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు అర్ధకేజీ పద్ధతిన, ముగ్గురు, నలుగురు సభ్యులు ఉన్న రేషన్ కార్డు దారులకు ఒక కేజీ చొప్పున, 5 మంది కన్నా ఎక్కువ సభ్యులు ఉన్న రేషన్ కార్డుదారులకు 1.50 కేజీల చొప్పున ఆహార కిట్లు అందిస్తారన్నారు.
పాఠశాల బస్సు ఢీకొని
విద్యార్థి మృతి
హోసూరు: ద్విచక్ర వాహనాన్ని ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొన్న ప్రమాదంలో ప్లస్‌వన్ విద్యార్థి మృతి చెందిన ఘటన నల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. హోసూరు సమీపంలోని నల్లూరు గ్రామానికి చెందిన సురేష్ కుమారుడు ఇంద్రేష్ (18). అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌వన్ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం నల్లూరు–హోసూరు రోడ్డుపై ఇంద్రేష్ ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. ఆ మార్గంలో వెళ్తున్న ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంద్రేష్‌ను స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై నల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనాన్ని
ఢీకొన్న కారు
● ఇంజినీర్ మృతి
క్రిష్ణగిరి: మత్తూరు సమీపంలో ద్విచక్ర వాహనంపై కారు దూసుకెళ్లిన ఘటనలో ఇంజినీర్ మృతి చెందాడు. మిత్రుడికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల మేరకు.. క్రిష్ణగిరి జిల్లా మత్తూరు సమీపంలోని జోగిపట్టి గ్రామానికి చెందిన మోహన్ (31). కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ప్రైవేట్ పరిశ్రమలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం అతడి మిత్రుడు ఎళిల్‌తో కలిసి ద్విచక్ర వాహనంలో మత్తూరు నుంచి జోగిపట్టి గ్రామం వైపు బయలుదేరారు. ఎదురుగా వచ్చిన కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోహన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతడి స్నేహితుడు ఎళిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు ఎళిల్‌ను చికిత్స కోసం మత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
వేశ్యావాటికపై దాడి
హోసూరు: హోసూరు ప్రాంతంలో మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ధర్మపురి జిల్లా మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని బాగలూరు రోడ్డు ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. ఆ మేరకు పోలీసులు ఇందిరానగర్ ప్రాంతంలో గస్తీ చేపట్టారు. ఆ సమయంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు కనుక్కున్న పోలీసులు.. ఆ ఇంటిపై దాడి చేశారు. ఇద్దరు మహిళలకు విముక్తి కల్పించారు. ధర్మపురి జిల్లా పాలకోడు ప్రాంతానికి చెందిన ధనలక్ష్మిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.